‘కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయొద్దు’ | Sanjay Manjrekar A Straightforward Person, Chandrakant Pandit | Sakshi
Sakshi News home page

 ‘కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయొద్దు’

Mar 19 2020 4:19 PM | Updated on Mar 19 2020 4:22 PM

Sanjay Manjrekar A Straightforward Person, Chandrakant Pandit - Sakshi

సంజయ్‌ మంజ్రేకర్‌(కర్టసీ: బీసీసీఐ)

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కామెంటరీ ప్యానల్‌ నుంచి ఉద్వాసనకు గురైన సంజయ్‌ మంజ్రేకర్‌కు మాజీ క్రికెటర్‌ చంద్రకాంత్‌ పండిట్‌ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్‌.. ఎవర్నీ కావాలని గాయపరచడంటూ వెనుకేసుకొచ్చాడు. తనకు మంజ్రేకర్‌ చిన‍్నతనం నుంచి తెలుసని, అతనిది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావమే తప్పితే వేరే ఉద్దేశాలు ఏమీ ఉండన్నాడు. ఒక కామెంటరీ చెప్పేటప్పుడు ప్రతీసారి ప్రజల్ని ఆకట్టుకునే వ్యాఖ్యానాలు అతను చేయలేకపోవచ్చని, అందుచేత మంజ్రేకర్‌ను తన కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయడం భావ్యం కాదన్నాడు. మంజ్రేకర్‌ను కాస్త దూకుడు తగ్గించమని బీసీసీఐ ఒక వార్నింగ్‌ ఇచ్చి, మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకోవాలన్ని చంద్రకాంత్‌ పండిట్‌ కోరాడు. (ఇక నీ వ్యాఖ్యానం అవసరం లేదు: సీఎస్‌కే)

‘ నాకు మంజ్రేకర్‌ బాల్యం నుంచి తెలుసు. ఇతరుల్ని గాయపరిచే మనస్తత్వం అతనిదైతే కాదు. ఉన్నది ఉన్నట్లు వ్యక్తిత్వం మంజ్రేకర్‌ది. ఆ విషయంలో నేను ఎప్పుడు అతన్ని అభిమానిస్తూనే ఉంటాను. ముఖం మీద మాట్లాడే స్వభావం ఉన్నవారిని ఎవరూ ఇష్టపడరు.. కానీ ఒక కామెంటేటర్‌గా అతను అందర్నీ అన్ని  వేళలా సంతృప్తి పరచలేడు. అతను చేసే జాబ్‌లో అది కుదరకపోవచ్చు. సంజయ్‌ ఎవరికీ వ్యతిరేకం కాదు. సంజయ్‌ను కామెంటేటర్‌గా తీసినందుకు నేను ఎవర్నీ నిందించడం లేదు. కేవలం నేను బీసీసీఐకి రిక్వెస్ట్‌ మాత్రమే చేస్తున్నా. మంజ్రేకర్‌ను తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోండి. ఒకసారి బీసీసీఐ తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా.. మొత్తం కామెంటరీ ప్యానల్‌లో ఉన్న అందరి ఇన్‌పుట్స్‌ తెప్పించుకోండి. అదే సమయంలో కోచ్‌లుగా చేసిన వారు మాట్లాడిన సందర్భాలను కూడా ఒకసారి పరిశీలించండి. ఒక బ్యాట్స్‌మన్‌ చెత్త షాట్‌ ఆడినప్పుడు కచ్చితత్వంతో మాట్లాడిన వారిని చాలామంది ప్రజలు అభిమానిస్తారు కదా.. అటు వంటప్పుడు సంజయ్‌ చేసిన దాంట్లో తప్పేముంది’ అని చంద్రకాంత్‌ పండిట్‌ ప్రశ్నించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement