గాయాలు దాటి గాడిలోకి.. | Sakshi
Sakshi News home page

గాయాలు దాటి గాడిలోకి..

Published Mon, Mar 31 2014 1:40 AM

Peaked beyond the wounds ..

ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌పై కశ్యప్ దృష్టి
 న్యూఢిల్లీ: గతంలో పదే పదే గాయాలు కావడంతో భవిష్యత్తుపై ఆందోళన చెందానని, అయితే ప్రస్తుతం వాటిని అధిగమించి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీకి సిద్ధమయ్యానని భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ అన్నాడు.
 
 మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి ఇండియా ఓపెన్ టోర్నీ జరగనున్న నేపథ్యంలో హైదరాబాదీ కశ్యప్ మాట్లాడుతూ... స్విస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. గత ఏడాది ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో కాలి మడమ గాయంతో మొదలుకొని కశ్యప్ వరుసగా గాయాలపాలయ్యాడు. ఫలితంగా పలు టోర్నీలకు దూరం కావాల్సి వచ్చింది. గత డిసెంబర్‌లో అయిన భుజం గాయం తిరిగి జర్మన్ ఓపెన్‌లో తిరగబెట్టింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు లోనయ్యానని కశ్యప్ తెలిపాడు. అయితే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో భుజానికి పట్టీ వేసుకొని ఆడడం సౌకర్యవంతంగా అనిపించిందని, స్విస్ ఓపెన్‌లోనూ అలాగే ఆడి సెమీస్‌కు చేరుకోగలిగానన్నాడు. ‘భుజానికి పట్టీతోనే స్విస్ ఓపెన్‌లో రాణించగలిగాను.
 
 దీంతో నొప్పి కూడా లేదు. మరో 4, 5 నెలలపాటు ఇలాగే ఆడాల్సి ఉంటుంద’ని కశ్యప్ అన్నాడు. ఇండియా ఓపెన్‌లో తొలిరౌండ్‌లోనే జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) వంటి గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొనాల్సి రావడం పరీక్షేనని, అయితే ప్రస్తుతం తన ఫామ్‌తో అతణ్ని ఓడించగలనని కశ్యప్ ధీమా వ్యక్తం చేశాడు.  ఇండియా ఓపెన్ తర్వాత కశ్యప్ ఏప్రిల్ 8 నుంచి 13 వరకు జరిగే సింగపూర్ ఓపెన్‌లో పాల్గొంటాడు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement