ఉగ్రదాడి.. పాక్‌ క్రికెట్‌కు గట్టిషాక్‌!

Pakistan Super League Telecast Suspended in India - Sakshi

పీఎస్‌ఎల్‌ ప్రసారాన్ని నిషేధించిన భారత్‌

న్యూఢిల్లీ : పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా ఆ దేశ క్రికెట్‌ బోర్డ్‌ పీసీబీకి భారత ఛానెల్‌ డీస్పోర్ట్స్‌ గట్టిషాక్‌ ఇచ్చింది. సరిగ్గా దాడి జరిగిన (ఫిబ్రవరి 14) రోజే ప్రారంభమైన పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రత్యక్షప్రసారాన్ని నిషేధించింది. (చదవండి: వారు చితక్కొట్టడంతోనే నా కొడుకు ఉగ్రవాదయ్యాడు)

ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందగా.. 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల యావత్‌ భారత్‌ ఉడికిపోతుంది. ప్రతీకార దాడి జరగాల్సిందేనని డిమాండ్‌ చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా.. ఉగ్రదాడిలో అసువులు బాసిన వీరజవాన్లకు భారత ప్రజలు నివాళులర్పిస్తున్నారు. తోచిన విరాళాలు ఇస్తూ వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ ఉగ్ర దాడితో దేశమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు భారత్‌లో ప్రసారం కావడం భావ్యం కాదని భావించిన డీస్పోర్ట్స్‌ ప్రత్యక్షప్రసారాన్ని పూర్తిగా నిషేధించింది. వాస్తవానికి లీగ్‌ రెండో రోజే సాంకేతిక లోపంతో ప్రసారం నిలిచిపోయినప్పటికి.. అధికారికంగా మాత్రం లీగ్‌ 5వ గేమ్‌ నుంచి నిలిపేసినట్లు ఛానెల్‌ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అమర జవాన్లకు సెల్యూట్‌)

మరోవైపు ఈ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలను క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తొలగించింది. బ్రాబోర్న్‌ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్‌ కమిటీ నిర్ణయించింది. ‘ఆల్‌ రౌండర్‌’ విభాగంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోను, క్రికెట్‌ జట్టు విభాగంలో పాకిస్తాన్‌ ఫొటోలను అక్కడ ఉంచారు. ఆ టీమ్‌లో ఇమ్రాన్‌ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్‌ కమిటీ సీనియర్‌ ఒకరు తెలిపారు. (చదవండి : ఆ జవాన్ల పిల్లలను నేను చదివిస్తా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top