అమర జవాన్లకు సెల్యూట్‌

40 funerals in 16 states - Sakshi

దేశవ్యాప్తంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

కదలివచ్చిన ప్రజలు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు

న్యూఢిల్లీ/లక్నో/జైపూర్‌: ఉద్వేగం ఉప్పొంగింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. మాతృ దేశ సేవలో నేలకొరిగిన అమర జవాన్లకు తుది వీడ్కోలు పలికేందుకు దేశమంతా కదిలొచ్చింది. మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచింది. పుల్వామా దాడిలో అసువులు బాసిన ధీశాలుల అంత్యక్రియలు శనివారం దేశవ్యాప్తంగా వారివారి స్వస్థలాల్లో అధికార లాంఛనాలతో జరిగాయి. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తమ వారి పట్ల గర్వం ఓ వైపు, తమలో ఒకరు ఇక లేరని వేదన మరోవైపు. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ..ఒక్కో వ్యథ. ఇంతటి విషాద సమయంలో జాతి అంతా ఒక్కటై ముష్కరుల కుట్రకు బలైన భరతమాత ముద్దు బిడ్డల సేవలను శ్లాఘిస్తూ ఘనంగా నివాళులర్పించింది.

పాకిస్తాన్‌ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాల్ని మూసేశారు. తమ గ్రామానికి చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాల్ని కడసారి చూసేందుకు ప్రజలు వీధుల్లో రోడ్లకు ఇరు వైపులా నిలబడ్డారు. పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి తమ స్వరాష్ట్రాలకు వెళ్లి అక్కడి మంత్రులతో కలసి వీర జవాన్ల అంతిమ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం కప్పిన జవాన్ల భౌతిక కాయాలను ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు సమీపంలోని విమానాశ్రయాలకు తరలించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వారివారి స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి చితికి నిప్పంటించగా, రాజస్తాన్‌లో రెండు నెలల పసిగుడ్డుతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం కంటతడిపెట్టించింది.

రాజస్తాన్‌లో...
రోషితాష్‌ లాంబా(జైపూర్‌), నారాయణ్‌లాల్‌ గుర్జార్‌(రాజసమంద్‌), జీత్‌రామ్‌(భరత్‌పూర్‌), భగీరథ్‌సింగ్‌(ధోల్‌పూర్‌), హేమరాజ్‌ మీనా(కోట)ల అంతిమయాత్రలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ‘పాకిస్తాన్‌ ముర్దాబాద్‌’, ‘భారత్‌ మాతాకీ జై’నినాదాలు మిన్నంటాయి.

ఉత్తరాఖండ్‌లో..
ఉద్ధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లాలోని మహ్మద్‌పూర్‌ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి వీరేంద్రసింగ్‌ చితికి నిప్పు పెట్టిన దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తమ సహచరుడికి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. ఇక డెహ్రాడూన్‌లో జరిగిన మోహన్‌లాల్‌ అంత్యక్రియలకు అశేష జనం హాజరయ్యారు.

పంజాబ్‌లో..
మోగా జిల్లాలోని గలౌటీ కుర్ద్‌ గ్రామంలో అమర జవాను జైమల్‌ సింగ్‌ మృతదేహానికి ఐదేళ్ల ఆయన కొడుకు గురుప్రకాశ్‌ నిప్పు అంటించాడు. గురుదాస్‌పూర్‌లో మణిందర్‌ సింగ్‌ భౌతికకాయానికి ఆయన తమ్ముడు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ అయిన లక్వీర్‌ సింగ్‌ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇక రూప్‌నగర్‌లో 26 ఏళ్ల కుల్వీందర్‌ సింగ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కుల్వీందర్‌ సింగ్‌ భౌతికకాయాన్ని చూసి ఆయనకు కాబోయే భార్య సొమ్మసిల్లిపడిపోవడం అక్కడున్న వారిని కలచివేసింది.

ఒడిశాలో..
పుల్వామా దాడిలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్‌ సాహూ, కటక్‌కు చెందిన మనోజ్‌కుమార్‌ల భౌతికకాయాలను స్వీకరించేందుకు భువనేశ్వర్‌ విమానాశ్రయానికి వేలాది మంది తరలివచ్చారు.

మహారాష్ట్రలో..
అమర జవాన్లు నితిన్‌ శివాజీ రాథోడ్‌(36), సంజయ్‌ సింగ్‌ దీక్షిత్‌(47)ల భౌతికకాయాలను శనివారం ఔరంగాబాద్‌ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాలకు పంపించారు.  

తమిళనాడులో..
అమర జవాన్లు జి.సుబ్రమణ్యం, సి.శివచంద్రన్‌ భౌతికకాయాలకు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్‌ నివాళులర్పించారు.

కర్ణాటకలో..
ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న అమర జవాన్‌ 33 ఏళ్ల హెచ్‌. గురు భౌతికకాయానికి ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు.

ఉత్తరప్రదేశ్‌లో..
కానౌజ్‌ జిల్లాలో అమర జవాన్‌ ప్రదీప్‌ సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియల సందర్భంగా ఆయన పదేళ్ల కూతురు సుప్రియ సొమ్మసిల్లింది. ఆయన రెండో కూతురు రెండున్నరేళ్ల చిన్నారిది అక్కడేం జరుగుతోందో అర్థం చేసుకోలేని పరిస్థితి. రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్, ఆగ్రా, మేన్‌పురి, ఉన్నావ్, కాన్పూర్, దెహాట్, చందౌళి జిల్లాల్లోనూ అమర జవాన్ల అంత్యక్రియల్లో ఇలాంటి గంభీర వాతావరణమే కనిపించింది. మాతృదేశ సేవలో నేలకొరిగిన సైనికుల సాహసాలను కీర్తిస్తూ వేలాది మంది ప్రజలు నినాదాలు చేశారు.

పుల్వామా దాడికి కారకులను శిక్షించాలని అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, అధికారుల్ని డిమాండ్‌ చేశారు. దియోరియా జిల్లాలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వస్తేనే తన భర్త విజయ్‌ మౌర్య అంత్యక్రియలకు అంగీకరిస్తానని ఆయన భార్య విజయ్‌ లక్ష్మి పట్టుపట్టారు. మంత్రి అనుపమా జైస్వాల్, ఇతర నాయకులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చందౌళిలో అవధేశ్‌ యాదవ్‌ అంత్యక్రియలు గంగా నదీ తీరంలో నిర్వహించారు. మహరాజ్‌గంజ్‌లోని ఓ పాఠశాలకు అమర జవాను పంకజ్‌ త్రిపాఠి పేరు పెడతామని కేంద్ర మంత్రి శివప్రతాప్‌ శుక్లా ప్రకటించారు.


తుదిహార్‌లో మహేశ్‌ యాదవ్‌ భౌతికకాయం వద్ద రోదిస్తున్న బంధువు..


కర్ణాటకలోని దొడ్డి గ్రామంలో విలపిస్తున్న హెచ్‌ గురు కుటుంబసభ్యులు


ఆగ్రాలో కుశల్‌కుమార్‌ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యుల రోదన..


కోల్‌కతాలో సుదీప్‌బిశ్వాస్‌ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top