
నివాళి
‘శ్రీరామాంజనేయ యుద్ధం’లో సీత... ఆ కళ్లల్లో కరుణ
‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర... ఆ కళ్లల్లో ఆత్మవిశ్వాసం...
పాత్రల్లోనేనా... పాటల్లోనూ ఆ కళ్లు ఎన్నో భావాలు పలికించాయి.
‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’.... ఆ కళ్లు వెచ్చని హాయిని కనబర్చాయి...
‘గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి’.... ఆ కళ్లల్లో కవ్వింపు...
ఇలా వెండితెరపై ఆమె కళ్లు జీవించాయి.
అందుకే తెలుగులో ‘జగదేక నటి’,
మాతృభాష కన్నడంలో ‘అభినయ సరస్వతి’,
తమిళంలో ‘కన్నడత్తు పైంగిళి’ (కన్నడ చిలుక).
బి. సరోజా దేవి కళ్లు ఇక విశ్రమించాయి...
అవి కనబర్చిన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాయి.
ప్రముఖ నటి బి. సరోజా దేవి (87) సోమవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో గల తన స్వగృహంలో సోమవారం ఎప్పటిలాగే ఉదయాన్నే నిద్రలేచిన సరోజా దేవి పూజ చేసి, టీవీ ఆన్ చేసి, కుర్చీలో కూర్చొని ఉండగా అస్వస్థతకు గురయ్యారని, సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
సినిమాలంటే ఇష్టం లేని ఓ తార ‘చతుర్భాష తారె’(నాలుగు భాషల తార)గా కితాబులు అందుకున్నారు. అవును... బి. సరోజా దేవికి సినిమాలంటే ఇష్టం లేదు. అయితే ఆమె తండ్రి భైరప్పకు నటనంటే ఇష్టం. వృత్తిరీత్యా ఆయన పోలీసు అయినప్పటికీ ఓ నాటక సంస్థలో నాటకాల్లో నటించేవారు. చిన్నప్పుడు సరోజా దేవితో కూడా నటింపజేసి, మురిసిపోయారు.
బెంగళూరులో 1938లో జనవరి 7న సరోజా దేవి జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు కాగా సరోజా దేవి ఆఖరి అమ్మాయి. మగపిల్లలు లేకపోవడంతో ఆమెకి అబ్బాయిలా డ్రెస్సులు వేసేవారు. దాంతో స్కూల్లో అబ్బాయిలు వెక్కిరిస్తే... ఇంటికొచ్చి ఏడ్చిన కూతురితో ‘కావాలంటే మీరూ అమ్మాయిలా బట్టలేసుకోండి’ అని చెప్పు అంటూ ఆమె తల్లి రుద్రమ్మ ఆత్మవిశ్వాసం నూరిపోశారు.
టీనేజ్‌లో వెండితెరపై...
ఓవైపు చదివిస్తూ మరోవైపు కూతురితో నాటకాల్లో నటింపజేశారు భైరప్ప. పదిహేడేళ్ల వయసులో సరోజాదేవి నటించిన ఒక నాటకం చూసి, కన్నడ దర్శక–నిర్మాత హొన్నప్ప భాగవతార్ ఆమెకు ‘మహాకవి కాళిదాశ’ (1955) సినిమాలో అవకాశం ఇచ్చారు. జాతీయ అవార్డు సాధించిన ఆ చిత్రంతో సరోజా దేవికి మంచి పేరు వచ్చింది. నిజానికి సరోజా దేవిని నటిని చేయాలనుకుని, డ్యాన్స్ కూడా నేర్పించారు భైరప్ప. డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు కుమార్తె కాళ్లు వాచిపోతే, ఓపికగా మసాజ్ చేసేవారట. అలాగే రుద్రమ్మ మాత్రం ఎప్పటికీ స్విమ్ సూట్ ధరించకూడదని, స్లీవ్‌లెస్ బ్లౌజులు వేయకూడదని కూతురికి నిబంధన విధించారట. తన కెరీర్ మొత్తంలో ఆ నిబంధనను పాటించారు సరోజా దేవి.
‘మహాకవి కాళిదాస’ తమిళంలో ‘మహాకవి కాళిదాస్’గా అనువాదమై, 1956లో విడుదలైంది. ఆ రకంగా తమిళ పరిశ్రమ దృష్టి సరోజా దేవిపై పడింది. విశేషం ఏంటంటే... తమిళంలో రిలీజైన నాలుగేళ్లకు శివాజీ గణేశన్, షావుకారు జానకిల కాంబినేషన్‌లో ‘మహాకవి కాళిదాస్’ (1966)గా రీమేక్ కూడా చేశారు. ఇక తమిళంలో ‘తిరుమణమ్’ (1956)లో నటించే అవకాశం సరోజా దేవికి దక్కింది. ఆ తర్వాత వరుసగా కన్నడ, తమిళ చిత్రాలు చేస్తున్న ఆమెకు తెలుగు నుంచి ఆహ్వానం అందింది. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘పాండురంగ మహత్మ్యం’ (1957)లో నటించే చాన్స్ అందుకున్నారు సరోజ. ఏ భాషలో నటిస్తే అది ఆమె మాతృభాష ఏమో అనిపించేలా నటన ఉండటంతో తెలుగు, తమిళ, కన్నడంలో వరుసగా ఆఫర్స్ వచ్చి, బిజీ తారగా మారిపోయారు. అలా ఆమె ‘పైఘమ్, ససురాల్’ తదితర హిందీ చిత్రాల్లోనూ నటించారు.
తెలుగులో పాతిక వరకూ...
తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఎక్కువ చిత్రాలు చేశారామె. వాటిలో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ’ వంటివి ఉన్నాయి. అలాగే అక్కినేని సరసన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న’ వంటివి చేశారు. ‘ఆత్మ బలం’లో ఏఎన్నార్‌తో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ పాటలో సరోజ వేసిన స్టెప్స్, కళ్లల్లో పలికించిన రొమాన్స్‌కి నాటి ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు. ఈ ‘చిటపట చినుకులు...’ పాటలో ఆమె తలకు స్కార్ఫ్ కట్టుకుని కనబడతారు. దానికో కథ ఉంది... అదేంటంటే...
ట్రెండ్ అయిన స్కార్ఫ్
‘చిటపట..’ చిత్రీకరించే ముందు సరోజ ఓ హిందీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ షూట్‌లో భాగంగా నెత్తిపై పాల కడవ పెట్టుకుని నడుస్తుంటే, ఆకతాయిలు ఆమెపై రాళ్లు విసురుతూ ఆట పట్టిస్తారు. ఓ రాయి సరిగ్గా సరోజ ముఖానికి తగిలి, గాయాలయ్యాయి. అదే సమయానికి ఇటు ఏఎన్నార్ కాంబినేషన్‌లో ‘చిట పట..’ పాట షూట్‌లో పాల్గొనాలి. దాంతో ముఖంపై మచ్చలు కనబడనివ్వకుండా స్కార్ఫ్‌తో మేనేజ్ చేశారు. ఆ తర్వాత ఆ స్కార్ఫ్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోవడం విశేషం. ఇక తనకు బాగా నచ్చిన పాటల్లో ‘చిట పట’ ఒకటని సరోజ పలు సందర్భాల్లో చె΄్పారు.
సరోజ చీరలు ఫేమస్
1960లలో సరోజా దేవి ధరించిన చీరలు, జాకెట్టులు, నగలు, హెయిర్ స్టైల్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఆ తరం అమ్మాయిలు ఆమె స్టైల్‌ని, మేనరిజమ్స్‌ని ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా తమిళ చిత్రాలు ‘ఎంగ వీట్టు పిళ్లై, అన్బే వా’లోని చీరలు, నగలను ఫాలో అయ్యారు.
బిజీగా ఉన్నప్పుడే వివాహం
1955లో నటిగా పరిచయమై, అక్కణ్ణుంచి పదేళ్లు బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో సరోజా దేవికి ఇంజినీర్ శ్రీహర్షతో 1967లో పెళ్లయింది. పెళ్లయ్యాక సినిమాలు చేయాలా? వద్దా? అనే మీమాంసలో పడ్డారట సరోజ. అయితే భర్త శ్రీహర్ష ప్రోత్సాహంతో సినిమాల్లో కొనసాగారు సరోజ. ఇక ఆమె భర్త అనారోగ్యం బారిన పడక ముందు ‘లేడీస్ హాస్టల్’ (1985) అనే కన్నడ సినిమా అంగీకరించారు. ఆ సినిమా అప్పుడే శ్రీహర్ష అనారోగ్యానికి గురి కావడంతో ఆమె షూటింగ్స్‌కి దూరమయ్యారు. చివరికి 1986లో భర్త చనిపోవడంతో ఆమె ఏడాది పాటు షూటింగ్స్‌కి దూరంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులు కానివారిని కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఏడాది తర్వాత ‘లేడీస్ హాస్టల్’ సినిమాతో పాటు అప్పటికే అంగీకరించిన ఎనిమిది చిత్రాలను పూర్తి చేశారామె. ఆ తర్వాత ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నారు.
ఫస్ట్ కన్నడ ఫిమేల్ సూపర్ స్టార్
నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు మళ్లీ కథానాయికగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్యారెక్టర్ నటిగానూ చేశారు. దాదాపు 200 చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి కన్నడ చిత్రం ‘నట సార్వభౌమ’ (2019). కన్నడంలో ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ రికార్డ్ ఆమెదే. ఇక వరుసగా 150కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించడం ఓ అరుదైన ఘనత.
జాతీయ అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా...
1998, 2005లో సరోజా 45వ జాతీయ సినిమా అవార్డు, 53వ జాతీయ సినిమా అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. కర్నాటక ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి అధ్యక్షురాలిగా, కన్నడ చలన చిత్ర సంఘ ఉపాధ్యక్షురాలిగానూ చేశారు. ఇక 60వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సరోజా దేవిని ‘జీవిత సాఫల్య’ పురస్కారంతో సత్కరించింది. అలాగే అంతకు ముందు 1969లో ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’, 1992లో ‘పద్మభూషణ్’ పురస్కారాలు అందుకున్నారామె. ఇంకా కన్నడ, తెలుగు, తమిళ రాష్ట్రాలకు చెందిన పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ అభినయ సరస్వతికి దక్కాయి.
చివరి కోరిక అదే
ఇప్పటివరకూ సరోజకు రీప్లేస్‌మెంట్‌గా మరో తార రాలేదు... భవిష్యత్తులోనూ రాకపోవచ్చు. అయితే ఆ కళ్లు కొన్నేళ్ల పాటు చూస్తుంటాయి. ఎందుకంటే మరణించిన తర్వాత నేత్రదానం చేయాలన్నది సరోజ చిట్ట చివరి కోరిక. కుటుంబ సభ్యులు ఆ కోరికను నెరవేర్చారు. ఇక... నటిగా ఆ కళ్లు ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉంటాయి.
నేడు అంత్యక్రియలు
సరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ వారం సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆ కళ్లల్లో ఆరిన తడి
సరోజా దేవికి ఇద్దరు కూతుళ్లు (ఇందిర, భువనేశ్వరి), ఒక కుమారుడు (గౌతమ్ రామచంద్రన్‡). కాగా భువనేశ్వరి అనారోగ్యంతో కన్నుమూయడం సరోజా దేవికి ఓ షాక్. అలాగే 1986లో ఆమె భర్త కూడా చనిపోయారు. ‘నా అనుకున్నవాళ్లు నా కళ్ల ముందే దూరం కావడం నాకు బాధగా అనిపించింది’ అంటూ ఆమె కంట తడిపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక భర్త చనిపోయాక సరోజా దేవికి కంటి సమస్య వచ్చింది. బాగా ఏడవడం వల్ల కళ్ల తడి ఆరిపోయి, ‘డ్రై ఐస్’తో బాధపడ్డారామె. చాన్నాళ్లపాటు ఆమెను ఈ బాధ వెంటాడింది. దీన్నిబట్టి భర్త పట్ల సరోజా దేవికి ఎంత మమకారం ఉండేదో ఊహించవచ్చు., ఇక కుమార్తె భువనేశ్వరి పేరిట అవార్డు ప్రవేశపెట్టి, సాహిత్య రంగంలో ప్రతిభావంతులకు అందజేస్తూ వచ్చారు.
ఆ ముగ్గురి జోడీ హిట్
అటు కన్నడ స్టార్ రాజ్‌కుమార్ ఇటు తెలుగు స్టార్ ఎన్టీఆర్ మరోవైపు తమిళ స్టార్ ఎంజీ రామచంద్రన్‌లకు జోడీగా సరోజా దేవి ఎక్కువ సినిమాల్లో నటించారు. ఈ ముగ్గురు హీరోలు–సరోజాదేవిది ‘హిట్ పెయిర్’. జయలలిత తర్వాత ఎంజీఆర్‌కి జోడీగా ఎక్కువ సినిమాల్లో నటించిన రికార్డ్ సరోజా దేవిదే. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నాడోడి మన్నన్’ బ్లాక్ బస్టర్. సరోజా దేవికి ఎంజీఆర్ అంటే చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే... తన తనయుడికి ఆయన పేరు వచ్చేట్లుగా ‘గౌతమ్ రామచంద్రన్’ అని పెట్టుకున్నారు. ఇక ఇంకో విశేషం ఏంటంటే.... తమిళ హీరో శివాజీ గణేశన్‌తో బ్యాక్ టు బ్యాక్ 22 హిట్ చిత్రాల్లో నటించారు సరోజా దేవి. వాటిలో ‘తంగమలై రహస్యం, భాగ పిరవినై, పార్తాల్ పసి తీరుమ్’ వంటివి ఉన్నాయి. అలాగే జెమినీ గణేశన్‌తో 15కి పైగా తమిళ చిత్రాల్లో నటించారు.
ముద్దు మాటల ముద్దుగుమ్మ
సరోజా దేవి మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి. చిన్నపిల్లలు మాట్లాడినట్లే. అయితే తన సహజ ధోరణి అది అని, కావాలని మాట్లాడలేదని ఓ ఇంటర్వ్యూలో సరోజా దేవి పేర్కొన్నారు. ప్రేక్షకులు తన మీద అభిమానంతో అలా ముద్దు మాటలు అనేవారని ఆమె అన్నారు.
గాసిప్ లేని నటి
దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్‌లో నాలుగు (కన్నడ, తెలుగు, తమిళ, హిందీ) భాషల్లో ఎందరో స్టార్ హీరోల సరసన నటించారు సరోజా దేవి. అయితే ఏ ఒక్క హీరోతోనూ తనకు లింకులు పెట్టి వదంతులు రాకపోవడం తన అదృష్టం అని ఓ సందర్భంలో సరోజా దేవి తెలిపారు. అలా గాసిప్ లేని నటి అనిపించుకోవడం తన పుణ్యం అని కూడా అన్నారామె.
శక్తిమంతమైన
స్త్రీ పాత్రల్లో ...1824లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన భారతీయ వీర వనిత కిత్తూరు చెన్నమ్మ పాత్రను చేశారు సరోజా దేవి. ‘కిత్తూరు రాణి చెన్నమ్మ’ టైటిల్‌తో రూపొందిన ఆ చిత్రంలో సరోజా దేవి అభినయం అద్భుతం. ఆ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. అలాగే ‘చింతామణి, శకుంతల’ వంటి కన్నడ చిత్రాల్లోనూ తెలుగులో ‘పండంటి కాపురం, గృహిణి’ తదితర చిత్రాల్లోనూ శక్తిమంతమైన స్త్రీ పాత్రలు పోషించి, మెప్పించారు.
– డి.జి. భవాని