పాకిస్తాన్‌ చేసింది ముమ్మాటికీ తప్పే: వకార్‌

Pakistan Got It Totally Wrong Against India In World Cup 2019, Waqar - Sakshi

కరాచీ: గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓటమి చెందడానికి టాస్‌ మొదలుకొని అనేక తప్పులు చేయడమే కారణమని ఆ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్‌‌ వకార్‌ యూనిస్‌ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచినా తొలుత  బ్యాటింగ్‌ చేయకపోవడం ఆ జట్టు చేసిన అతి పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డాడు.  భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తే ఆదిలోనే వికెట్లు సాధించి ఒత్తిడిలోకి నెట్టవచ్చని పాక్‌ ఆశించిందని అది కొంపముంచిందన్నాడు. భారత క్రికెట్‌ జట్టులో మంచి ఓపెనర్లు ఉన్నారన్న సంగతిని ఆ సమయంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌గా ఉన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ మరచిపోయినట్లు ఉన్నాడని ఎద్దేవా చేశాడు. అనాలోచిత నిర్ణయాలతోనే పాక్‌ భారీ మూల్యం చెల్లించుకుందని వకార్‌ విమర్శించాడు. (సుశాంత్‌ను కలుస్తానని మాటిచ్చా..)

‘టాస్‌ దగ్గర్నుంచీ పాకిస్తాన్‌ తప్పుచేయడం ఆరంభించింది. టాస్‌ గెలిచి భారత్‌కు బ్యాటింగ్‌ ఇచ్చారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్‌ ఇవ్వడం అంటే చాలా పెద్ద పొరపాటు. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది మొదలు చివరి వరకూ పరుగుల వరద పారించింది. పాకిస్తాన్‌ బౌలర్లకు పిచ్‌ నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. భారత్‌ను ఆపడం పాక్‌ బౌలర్లకు కష్టంగా మారిపోయింది. అదే  పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ముందుగా బ్యాటింగ్‌ చేసే అవకాశాన్ని భారత్‌ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది’ అని వకార్‌ తెలిపాడు. ఆనాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్‌ శర్మ(140), కేఎల్‌ రాహుల్‌(57), విరాట్‌ కోహ్లి(77)లు రాణించడంతో భారత్‌ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ ఛేజింగ్‌లో విఫలమైంది. ఫకార్‌ జమాన్‌(62), బాబర్‌ అజామ్‌(48)లు మాత్రమే రాణించడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు.  డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత్‌ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కల్గించిన ఆ మ్యాచ్‌కు పాకిస్తాన్‌ 40 ఓవర్లలో ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓటమి పాలైంది. (శ్రీశాంత్‌.. నీ కోసమే వెయిటింగ్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top