శ్రీశాంత్‌.. నీ కోసమే వెయిటింగ్‌

Looking Forward To Sreesanth's Comeback, Sachin Baby - Sakshi

తిరువనంతపురం: స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధానికి గురైన శ్రీశాంత్‌ తన రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్‌పై నిషేధం ముగియనుండటంతో క్రికెట్‌ పునరాగమనం కోసం యత్నాలు ఆరంభించాడు. దేశవాళీ సీజన్‌లో భాగంగా తన రాష్ట్ర రంజీ జట్టు కేరళతో ఆడాలనే యత్నంలో ఉన్నాడు. దీనిపై కేరళ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ బేబీ మాట్లాడుతూ. శ్రీశాంత్‌ కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు. గత ఏడేళ్లుగా శ్రీశాంత్‌ కేరళ జట్టుకు దూరమైన విషయాన్ని కాస్త బాధగా చెప్పిన సచిన్‌ బేబీ.. అతను ఎప్పుడూ జట్టుకు సలహాలు ఇస్తూ ఉండేవాడనే విషయాన్ని వెల్లడించాడు. గతంలో ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా శ్రీశాంత్‌ బౌలింగ్‌ చేసేవాడన్నాడు. (శ్రీశాంత్‌ మళ్లీ వస్తున్నాడు...)

శ్రీశాంత్‌ పేస్‌లో స్వింగ్‌ ఎక్కువగా ఉండటంతో తాను ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడేవాడినని సరదాగా వ్యాఖ్యానించాడు. టెలివిజన్‌ కామేంటేటర్‌, ప్రజెంటర్‌ అరుణ్‌ వేణుగోపాల్‌తో ఇన్‌స్టా లైవ్‌ సెషన్‌లో అనేక విషయాలను సచిన్‌ బేబీ షేర్‌ చేసుకున్నాడు. ‘ నాకు శ్రీశాంత్‌ సోదరుడు లాంటివాడు.  కేరళ తరఫున మళ్లీ ఆడతాడని ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.మా జట్టులోని ఆటగాళ్లంతా శ్రీశాంత్‌ రీఎంట్రీ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. మేమిద్దరం గత కొన్నేళ్లుగా కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నాం. నాకు శ్రీశాంత్‌ చాలా సాయం చేశాడు. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నాం. శ్రీశాంత్‌తో ప్రాక్టీస్‌ ప్రయాణం కొనసాగుతూనే ఉంది.  కేరళ జట్టుకు సలహాలు ఇస్తూ సహకరిస్తున్నాడు. అతను నెట్స్‌లో బౌలింగ్‌ అమోఘంగా వేస్తున్నాడు. ఇది వరకు శ్రీశాంత్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. ఇక శ్రీశాంత్‌ తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపించాల్సి ఉంది’ అని కేరళ మాజీ కెప్టెన్‌ సచిన్‌ బేబీ తెలిపాడు.

భారత్‌ తరఫున 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్‌ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టి20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టి20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన జట్లలో అతను సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడుతూ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్‌ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్‌ దీనిని సవాల్‌ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్‌కు ఊరట లభించింది. శ్రీశాంత్‌ను దోషిగానే గుర్తించిన సుప్రీం... జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది. (‘చాలాసార్లు చనిపోవాలనుకున్నా’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top