మళ్లీ జొకోవిచ్‌దే ఆస్ట్రేలియా ఓపెన్‌

Novak Djokovic Wins the Australian Open Again - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి అత్యధిక సార్లు ఈ టైటిల్‌ గెలిచిన సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఒకవైపు.. గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీల్లో మూడుసార్లు మాత్రమే ఫైనల్‌కు చేరిన ఆస్ట్రియా సంచలనం డొమనిక్‌ థీమ్‌ మరొకవైపు. దాంతో పోరు ఏకపక్షమే అనుకున్నారు.  కానీ జొకోవిచ్‌కు థీమ్‌ ముచ్చెమటలు పట్టించాడు.  దాదాపు నాలుగు గంటల పాటు పోరాడి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. చివరి వరకూ పోరాడి ఓడినా ఆద్యంతం ఆకట్టుకున్నాడు.  చిన్నచిన్న పొరపాట్లు థీమ్‌ ఓడేలా చేస్తే.. అనుభవాన్ని ఉపయోగించి కడవరకూ రేసులో ఉన్న జొకోవిచ్‌ మరోసారి టైటిల్‌ గెలుచుకున్నాడు. ఈ రోజు(ఆదివారం) జరిగిన పురుషుల ఫైనల్‌ పోరులో జొకోవిచ్‌ 6-4, 4-6, 2-6, 6-3, 6-4 తేడాతో థీమ్‌పై గెలిచి టైటిల్‌ను సాధించాడు. ఇది జొకోవిచ్‌ ఎనిమిదో ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ కాగా, ఈ టోర్నీలో థీమ్‌కు ఇదే తొలి ఫైనల్‌. 

తొలి సెట్‌ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న జొకోవిచ్‌.. రెండో సెట్‌ను చేజార్చుకున్నాడు. అద్భుతమైన ఏస్‌లతో చెలరేగిన థీమ్‌ రెండో సెట్‌ను అవలీలగా గెలిచాడు. ఇక మూడో సెట్‌లో కూడా అదే ఊపును కనబరిచి జొకోవిచ్‌పై పైచేయి సాధించాడు. దాంతో నాలుగు, ఐదు సెట్లను గెలవాల్సిన పరిస్థితికి జొకోవిచ్‌కు ఎదురైంది. కీలక సమయంలో ఎదురునిలిచిన జొకోవిచ్‌ ఎటువంటి పొరపాట్లు చేయలేదు. థీమ్‌ చేత పొరపాట్లు చేయిస్తూ ఒక్కో పాయింట్‌ సాధిస్తూ సెట్‌ను గెలుచుకున్నాడు. ఫలితంగా రేసులోకి వచ్చేశాడు. ఇక మ్యాచ్‌ నిర్ణయాత్మక ఐదో సెట్‌లో జొకోవిచ్‌ మిక్కిలి శ్రమించాడు. ఈ సెట్‌లో ఇద్దరి స్కోరు సమంగా ఉన్న దశలో జొకోవిచ్‌ తనలోని అసలైన ఆటను బయటకు తీశాడు. థీమ్‌ను వెనక్కి నెడుతూ ఆ సెట్‌తో పాటు ఆస్ట్రేలియా ఓపెన్‌ అంటేనే తనదనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

ఇది జొకోవిచ్‌కు ఎనిమిదో ఆస్ట్రేలియా ఓపెన్‌ కాగా, ఓవరాల్‌గా 17వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌ను అత్యధికంగా గెలిచిన రికార్డును జొకోవిచ్‌ మరోసారి సవరించుకున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో  విజేతగా నిలవడం ద్వారా ఎమర్సన్‌, ఫెడరర్‌ (ఆరు సార్లు విజేతలుగా నిలిచారు)ల పేరిట ఉన్న రికార్డును చెరిపివేసిన సంగతి తెలిసిందే.  కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకోవిచ్‌ (2020, 2019, 2016, 2015, 2013, 2012, 2011, 2008)ఫైనల్‌కు చేరిన ఎనిమిది సార్లూ విజేతగా నిలవడం మరో విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top