గంగూలీనే సరైనోడు...

No Better Person Than Ganguly To Lead BCCI Vinod Rai - Sakshi

బోర్డును నడిపించే సత్తా అతనికే ఉంది

సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: లోధా సంస్కరణల కోసమే తాత్కాలికంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)లోకి ప్రవేశించినా సుదీర్ఘ కాలం పాటు పరిపాలక కమిటీ (సీఓఏ) పనిచేసింది. మొత్తానికి బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంతో సీఓఏ కథ ముగిసింది. ఈ నేపథ్యంలో సీఓఏ చీఫ్‌గా వినోద్‌ రాయ్‌ ఆఖరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌరవ్‌ గంగూలీ కంటే సమర్థుడైన అధ్యక్షుడు లేడని అభిప్రాయపడ్డారు. ఇంకా ఏమన్నారంటే...

ఈ బాధ్యతలు తృప్తినిచ్చాయి...

నాకు ఈ బాధ్యతలు సంతృప్తికర అనుభవాన్నిచ్చాయి. ఆటగాళ్ల సంఘాన్ని నియమించాం. అరకొర అయినా ఎట్టకేలకు మహిళల ఐపీఎల్‌ మ్యాచ్‌ల్నీ నిర్వహించాం. ప్రతీ అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరించాం. వందకుపైగా జరిగిన సీఓఏ సమావేశాల తాలుకూ నివేదికల్ని బీసీసీఐ వెబ్‌సైట్‌లో పెట్టాం. లోధా సిఫార్సుల్ని ఎక్కడా నీరుగార్చలేదు. మొత్తమ్మీద నలుగురు మాజీల్ని బోర్డు ప్రధాన పదవుల్లో చూస్తుంటే ఆనందంగా ఉంది. అధ్యక్షుడిగా గంగూలీ, ఐపీఎల్‌ చైర్మన్‌గా బ్రిజేశ్‌ పటేల్, అపెక్స్‌ కౌన్సిల్‌లో అన్షుమన్‌ గైక్వాడ్, శాంతా రంగస్వామిలు బీసీసీఐ ముఖ్య పదవుల్లో ఉన్నారు.

‘దాదా’ అంటే గౌరవం...

మాజీ కెప్టెన్‌ గంగూలీ అంటే నాకెంతో గౌరవం. అతను బెంగాల్‌ క్రికెట్‌ సంఘాన్ని నడిపించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. అలాగే బీసీసీఐని నడిపించే నాయకత్వ లక్షణాలు ఈ మాజీ కెప్టన్‌న్‌కు ఉన్నాయి. నా దృష్టిలో బోర్డు అధ్యక్షుడిగా అతనికన్నా సమర్థ నాయకుడు లేడు.

వాటిని పట్టించుకోను....

సీఓఏలో పెద్దగా సవాళ్లేమీ లేవు. అనర్హతకు గురైన ఆ 70 మందితో నాకు అసలు పరిచయమే లేదు. వాళ్లు పోరాడింది కోర్టులోనే! ఇక విమర్శలంటారా... వాటిని నేను పట్టించుకోను. నిజం చెప్పాలంటే సంస్కరణలు ఇష్టం లేనివారే ఆరోపణలు చేశారు. నన్ను విమర్శించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top