విజయంతో ముగించిన ఆంధ్ర

Mustafa Ali Trophy: andhra win the last match - Sakshi

చివరి మ్యాచ్‌లో మణిపూర్‌పై గెలుపు

ముస్తాక్‌ అలీ ట్రోఫీ  సూపర్‌ లీగ్‌కు అనర్హత 

సాక్షి, విజయవాడ: బ్యాట్స్‌మెన్‌ చెలరేగడంతో... మణిపూర్‌తో జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ జాతీయ టి20 టోర్నమెంట్‌ గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఏడు జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో ఆంధ్ర నిర్ణీత ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకొని మూడు విజయాలు, మూడు పరాజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 20 పాయింట్ల చొప్పున సాధించిన ఢిల్లీ, జార్ఖండ్‌ జట్లు గ్రూప్‌ ‘ఎ’ నుంచి సూపర్‌ లీగ్‌ దశకు అర్హత సాధించాయి.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 252 పరుగులు చేసింది. ఓపెనర్లు అశ్విన్‌ హెబర్‌ (37 బంతుల్లో 71; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రణీత్‌ (43 బంతుల్లో 71; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో కదంతొక్కి తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించడం విశేషం. అనంతరం రికీ భుయ్‌ (20 బంతుల్లో 59 నాటౌట్‌; ఫోర్, 7 సిక్స్‌లు), గిరినాథ్‌ రెడ్డి (14 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడటంతో ఆంధ్ర భారీ స్కోరు నమోదు చేసింది.
 

253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్‌ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 161 పరుగులు చేసి ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లలో స్వరూప్‌ 26 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. న్యూఢిల్లీలో గ్రూప్‌ ‘ఇ’లో భాగంగా హైదరాబాద్, ఉత్తరాఖండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. హైదరాబాద్‌ ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.  మరోవైపు గ్రూప్‌ ‘బి’ నుంచి విదర్భ, గుజరాత్‌... గ్రూప్‌ ‘సి’ నుంచి ముంబై, రైల్వేస్‌... గ్రూప్‌ ‘డి’ నుంచి కర్ణాటక, బెంగాల్‌... గ్రూప్‌ ‘ఇ’ నుంచి ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర జట్లు కూడా సూపర్‌ లీగ్‌ దశకు అర్హత పొందాయి. సూపర్‌ లీగ్‌ చేరిన 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఈనెల 8 నుంచి సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్‌ ‘ఎ’... ‘బి’లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు 14న జరిగే ఫైనల్లో టైటిల్‌ కోసం తలపడతాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top