breaking news
Syed Ali
-
ఆబిద్ అలీ అస్తమయం
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఆబిద్ అలీ (83) కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. 1960వ, 1970వ దశకాల్లో భారత క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆబిద్ అలీ అంతర్జాతీయ కెరీర్ ఎనిమిదేళ్ల పాటు సాగింది. 1967–1975 మధ్య కాలంలో భారత్ తరఫున 29 టెస్టుల్లో ఆయన 20.36 సగటుతో 1018 పరుగులు చేశారు.ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మీడియం పేసర్ అయిన అలీ 42.12 సగటుతో 47 వికెట్లు కూడా పడగొట్టారు. ఆయన వన్డే కెరీర్ 5 మ్యాచ్‌లకే పరిమితమైంది. 5 వన్డేలు కలిపి ఆయన 93 పరుగులు చేయడంతోపాటు 7 వికెట్లు తీసుకున్నారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆబిద్ అలీకి ఘనమైన రికార్డు ఉంది. ఏకంగా 212 మ్యాచ్‌లు ఆడిన ఆయన 8732 పరుగులు చేయడంతో పాటు 397 వికెట్లు తీశారు. రిటైర్మెంట్ తర్వాత ఆబిద్ అలీ కొన్నేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత కోచింగ్ వైపు మళ్లారు. ఆంధ్ర రంజీ టీమ్‌తో పాటు యూఏఈ, మాల్దీవ్స్ జట్లకు ఆబిద్ అలీ కోచ్‌గా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న తర్వాత అక్కడి నార్త్ అమెరికా క్రికెట్ లీగ్‌లో ఆటను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. చాలా విషాదకర వార్త. ఆబిద్ అలీ జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే దమ్మున్న క్రికెటర్. మిడిలార్డర్లో ఆడుతున్నప్పుడు కూడా జట్టు అవసరం కోసం ఓపెనింగ్‌కు కూడా సిద్ధమయ్యాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో లెగ్ సైడ్‌లో అతను అందుకున్న చురుకైన క్యాచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. టెస్టుల్లో తొలి బంతికే అతను వికెట్ తీసిన రెండు సందర్భాలు నాకు గుర్తున్నాయి. నా తొలి టెస్టులో వికెట్ల మధ్య అతను చురుగ్గా పరుగెత్తిన తీరు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం నాకు బాగా గుర్తుంది. వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి. – సునీల్ గావస్కర్హైదరాబాదీ ఆల్‌రౌండర్‘ఆబిద్ అలీ తరహా ఆటకు వన్డే క్రికెట్ సరిగ్గా సరిపోయింది. ఈ ఫార్మాట్లో అతను అత్యుత్తమ ఆటగాడిగా నిలిచేవాడు. కానీ దురదృష్టవశాత్తూ 20 ఏళ్లు ముందుగా అతను పుట్టాడు’... ఆబిద్ అలీ గురించి, ఆయన ఆట గురించి బాగా తెలిసిన సన్నిహితులు చెప్పే మాట ఇది. స్ప్రింటర్లో ఉండే చురుకుదనం, మారథాన్ రన్నర్ తరహాలో శ్రమించే తత్వం, డెకాథ్లెట్ తరహాలో పట్టుదల ఆయనలో కనిపించేది. ఆటపరంగా చూస్తే మీడియం పేస్ బౌలింగ్, లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం, అద్భుత ఫీల్డింగ్‌తో ఒక వన్డే క్రికెటర్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఆబిద్లో ఉండేవి. వికెట్ల మధ్య పరుగెత్తే చురుకుదనం గురించి ప్రత్యేక ప్రశంస వినిపించేది. అవతలి ఎండ్‌లో ఆబిద్ ఉంటే సహచర బ్యాటర్ కూడా ఆయనతో పోటీ పడి పరుగెత్తలేక జాగ్రత్త పడేవాడు. సౌత్‌జోన్ తరఫున ఆడుతున్నప్పుడు దిగ్గజం గుండప్ప విశ్వనాథ్‌కు కూడా ఇదే అనుభవం ఎదురై రనౌట్ కావాల్సి వచ్చింది. అయితే ఆబిద్ వన్డే కెరీర్ వేర్వేరు కారణాలతో 5 మ్యాచ్‌లకే పరిమితమైంది. భారత జట్టు తొలి వన్డే మ్యాచ్ (1974 జూలై 13న, ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో) ఆడిన జట్టులో భాగంగా ఉన్న ఆయన తొలి బంతిని బౌల్ చేసిన చిరస్మరణీయ ఘనతను సొంతం చేసుకున్నారు. తొలి వన్డే వరల్డ్‌కప్‌లో (1975) భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచినా... అనూహ్యంగా అదే ఆఖరి వన్డే కూడా అయింది. ఇవన్నీ కూడా భారత జట్టుకు తొలి ఐదు వన్డేలే కావడం గమనార్హం. మరచిపోలేని ప్రదర్శనలు... 1971లో ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గింది. తొలి రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగియగా, ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో గెలిచి భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో చివరి రోజు ‘విన్నింగ్ షాట్’ బౌండరీ కొట్టిన బ్యాటర్‌గా ఆబిద్ అలీ అందరికీ గుర్తుండిపోయారు. 1971లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్ గెలిచి ఆపై తొలిసారి సిరీస్ సొంతం చేసుకున్న చిరస్మరణీయ టెస్టులో వరుస బంతుల్లో రోహన్ కన్హాయ్, క్లయివ్ లాయిడ్లను అవుట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అదే సిరీస్‌లో జార్జ్‌టౌన్ టెస్టులో చేసిన అజేయ అర్ధ సెంచరీ కూడా ఆయన బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఆడిన 29 టెస్టుల్లో 7 టెస్టుల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయడంతో పాటు ఓపెనింగ్ బౌలర్‌గా కూడా ఆడిన ఘనత ఆబిద్ అలీ సొంతం. అరంగేట్రంలోనే సత్తా చాటి... హైదరాబాద్‌లో స్కూల్ క్రికెట్ ద్వారా వెలుగులోకి వచి్చన గత తరం క్రికెటర్లలో ఆబిద్ అలీ ఒకరు. స్కూల్ టోర్నీల్లో ప్రదర్శన ద్వారా హైదరాబాద్ జూనియర్ జట్టులోకి, ఆపై ఉద్యోగరీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తరఫున ప్రదర్శనతో హైదరాబాద్ సీనియర్ టీమ్‌లోకి ఆయన ఎంపిక అయ్యారు. దేశవాళీలో నిలకడైన ప్రదర్శన ఆబిద్ అలీకి భారత జట్టులో చోటు దక్కేలా చేసింది. 1967లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో టెస్టుతో ఆయన కెరీర్ మొదలైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శనతో ఆయన అరంగేట్రం చేశారు. ఇదే సిరీస్‌లో సిడ్నీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో 78, 81 స్కోర్లతో టాప్ స్కోరర్‌గా తన ముద్ర వేస్తూ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు. ఆ తర్వాత వరుసగా ఏడేళ్ల పాటు ఆబిద్ కెరీర్ నిరాటంకంగా సాగింది. తన మీడియం పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఆబిద్‌కు అప్పటి పరిస్థితుల్లో పెద్దగా బౌలింగ్ చేసే అవకాశాలు రాలేదు. ప్రఖ్యాత భారత స్పిన్ చతుష్టయం శాసిస్తున్న ఆ రోజుల్లో మీడియం పేసర్లు ఆరంభంలో కొన్ని ఓవర్లు బౌలింగ్ వేసి బంతిని కాస్త పాతబడేలా చేయడమే ఉండేది. అక్కడితోనే వారి పని ముగిసేది. అయితే బ్యాటింగ్‌లో మాత్రం చాలా సందర్భాల్లో ఆబిద్ తన ముద్ర వేశారు. ముఖ్యంగా జట్టు అవసరాల కోసం 1 నుంచి 9 వరకు (నాలుగో స్థానం మినహా) అన్ని స్థానాల్లో ఆయన బ్యాటింగ్ చేశారు. -
విజయంతో ముగించిన ఆంధ్ర
సాక్షి, విజయవాడ: బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో... మణిపూర్‌తో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జాతీయ టి20 టోర్నమెంట్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఏడు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో ఆంధ్ర నిర్ణీత ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకొని మూడు విజయాలు, మూడు పరాజయాలతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 20 పాయింట్ల చొప్పున సాధించిన ఢిల్లీ, జార్ఖండ్ జట్లు గ్రూప్ ‘ఎ’ నుంచి సూపర్ లీగ్ దశకు అర్హత సాధించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 252 పరుగులు చేసింది. ఓపెనర్లు అశ్విన్ హెబర్ (37 బంతుల్లో 71; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రణీత్ (43 బంతుల్లో 71; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో కదంతొక్కి తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించడం విశేషం. అనంతరం రికీ భుయ్ (20 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 7 సిక్స్‌లు), గిరినాథ్ రెడ్డి (14 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడటంతో ఆంధ్ర భారీ స్కోరు నమోదు చేసింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 161 పరుగులు చేసి ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లలో స్వరూప్ 26 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. న్యూఢిల్లీలో గ్రూప్ ‘ఇ’లో భాగంగా హైదరాబాద్, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. హైదరాబాద్ ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు గ్రూప్ ‘బి’ నుంచి విదర్భ, గుజరాత్... గ్రూప్ ‘సి’ నుంచి ముంబై, రైల్వేస్... గ్రూప్ ‘డి’ నుంచి కర్ణాటక, బెంగాల్... గ్రూప్ ‘ఇ’ నుంచి ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర జట్లు కూడా సూపర్ లీగ్ దశకు అర్హత పొందాయి. సూపర్ లీగ్ చేరిన 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఈనెల 8 నుంచి సూపర్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్ ‘ఎ’... ‘బి’లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు 14న జరిగే ఫైనల్లో టైటిల్ కోసం తలపడతాయి. -
ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం
కృష్ణా జిల్లా మైలవరంలో ఏడేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. మంగళవారం ఉదయం తారకరామానగర్‌లో ఇది జరిగింది. ఏడేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా... సయ్యద్ అలీ (70) చాక్ల్లెట్ ఇస్తానని చెప్పి ఆ బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. వివస్త్రను చేస్తున్న సమయంలో స్థానికులు చూసి అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సయ్యద్ అలీని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
ఆర్టీసీ డ్రైవర్‌పై యువకుల దాడి
చాంద్రాయణగుట్ట: గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస దాడులపై ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహించారు. మూడు రోజుల క్రితం సయ్యద్ అలీ చబుత్రాలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం మధ్యాహ్నం మరో డ్రైవర్‌పై దాడి చేయడంతో కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం నుంచి డిపోలోని ఒక్క బస్సును కూడా కదలనివ్వలేదు సరికదా, గ్రేటర్ హైదరాబాద్‌లోని ఏ డిపో బస్సు కూడా పాతబస్తీకి రాకుండా యూనియన్ల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఫలక్‌నుమా డిపోకు చెందిన 162 బస్సులు మధ్యాహ్నం నుంచి డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వివరాలివీ..ఫలక్‌నుమా డిపోనకు చెందిన కేశంపేట రూట్ బస్సును శుక్రవారం మధ్యాహ్నం డ్రైవర్ మహమూద్ చార్మినార్ వైపు తీసుకెళుతున్నాడు. శంషీర్‌గంజ్ వద్దకు రాగానే గుర్తు తెలియని యువకులు బస్సుపైకి రాళ్లు రువ్వారు. దీంతో డ్రైవర్ తలకు గాయమైంది. వెంటనే బస్సును నిలిపి కిందికి దిగిన డ్రైవర్‌ను ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టి పరారయ్యారు. బాధితుడు విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన డిపో మేనేజర్, తోటి కార్మికులు బస్సును డిపోకు తీసుకొచ్చి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై శాలిబండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధర్నాకు దిగిన కార్మికులు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి విషయం తెలుసుకున్న వెంటనే ఫలక్‌నుమా డిపోకు చెందిన కార్మికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లనీయకుండా గేట్ ముందు బైఠాయించారు. యూనియన్ల నాయకులు రంగంలోకి దిగి అన్ని డిపోలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. దాడులతో సిబ్బంది అభద్రతాభావానికి గురవుతున్నారని వివరించారు. పాత నగరానికి ఒక్క బస్సును కూడా తీసుకురాకుండా చూడాలని చెప్పడంతో ఇతర డిపోల బస్సులు అటు రాలేదు. ఈ సందర్భంగా యూనియన్ల నాయకులు ఎం.వి.నాథ్, సోమ్లాల్, ప్రభాకర్ రెడ్డి, ఆర్.ఎన్.రెడ్డి, జమీర్, హనీఫ్‌లు విలేకర్లతో మాట్లాడుతూ దాడులతో తాము ఉద్యోగాలు చేయలేకపోతున్నామన్నారు. చితకబాదడం సరైంది కాదన్నారు. ఆర్టీసీ కార్మికులకు రక్షణ ఇస్తామని స్పష్టమైన హామీ వచ్చేంత వరకు విధుల్లోకి చేరబోమని వారు స్పష్టం చేశారు. సంయమనం పాటించాలి: డిపో మేనేజర్ ప్రమాదాల సమయంలో స్థానిక ప్రజలు సంయమనం పాటించాలని డిపో మేనేజర్ బి.రమేష్ కోరారు. సయ్యద్ అలీ చబుత్రాలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని సిబ్బందిపై దాడులు చేసి ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేయడం సరి కాదన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేయాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదన్నారు.