రిటైర్మెంట్‌ నిర్ణయం ధోని వ్యక్తిగతం

MSK Prasad Says Legendary Player Like MS Dhoni Knows When to Retire - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా లెజండరీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఎప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోవాలో తెలుసని భారత ఛీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. అది ధోని వ్యక్తిగత నిర్ణయమని అతని రిటైర్మెంట్‌పై వస్తున్న ఉహాగానాల నేపథ్యంలో పేర్కొన్నారు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ ఎంఎస్‌ ధోని విండీస్‌ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. అతని గైర్హాజరీ విషయాన్ని ముందే తెలియజేశాడు. ప్రపంచకప్‌ నుంచే మా దగ్గర ప్రణాళికలున్నాయి. కానీ ప్రపంచకప్‌లో కొన్ని వ్యూహాలు ఫలించలేదు. రిషబ్‌ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేం భావిస్తున్నాం. ప్రస్తుతం మా ప్రణాళిక కూడా అదే. ధోని భవిష్యత్తు గురించి కూడా అతనితో చర్చించాం. రిటైర్మెంట్‌ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. దిగ్గజ క్రికెటర్‌ ధోనికి ఎప్పుడు రిటైర్‌ అవ్వాలనే విషయం తెలుసు. కానీ మేం మా భవిష్యత్తు ప్రణాళికలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం.’ అని ఎమ్మెస్కే స్పష్టం చేశాడు.

ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోని స్ట్రైక్‌రేట్‌, స్లోబ్యాటింగ్‌ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెస్కే మాత్రం స్ట్రైక్‌రేట్‌ గురించి తాము ఆలోచించడం లేదని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నామన్నారు. రిషభ్‌ పంత్‌ మూడు ఫార్మాట్లు ఆడుతాడని, అతనిపై పనిభారం పడకుండా చూసుకుంటామని, వృద్ధిమాన్‌ సాహా, కేఎస్‌ భరత్‌లను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తామన్నారు. రాబోయే రెండు నెలలు ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్‌ ఆర్మీ)లో పని చేయాలని భావించిన ధోని.. విండీస్‌ పర్యటన నుంచి స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top