రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే

MSK Prasad Says Enjoyed Reading Rayudu Timely Tweet - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదన్న అసహనంతో అంబటి రాయుడు చేసిన త్రీడీ ట్వీట్‌ను ఆస్వాదించానని టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. ప్రపంచకప్‌ జట్టుకు విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై రాయుడు స్పందిస్తూ త్రీడీ కళ్లజోడు కొనుక్కుని వరల్డ్ కప్ చూస్తానంటూ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాయుడు ఏకంగా క్రికెట్కే గుడ్ బై చెప్పాడు. రాయుడి రిటైర్మెంట్‌కు త్రీడీ ట్వీట్‌ కూడా ఓ కారణమేనని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, తాజాగా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించిన తర్వాత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ట్వీట్‌పై స్పందించాడు.

‘అంబటి రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించాను. వ్యంగ్యంతో కూడిన ఆ ట్వీట్‌ చాలా బాగుంది. రాయుడి భావోద్వేగాలను అర్థం చేసుకున్నాం. జట్టు ఎంపికలో మాకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఎవరి విషయంలోనూ తమకు ద్వేషం, పక్షపాతం లేదు. రాయుడు టీ20 ప్రదర్శన ఆధారంగా వన్డేలకు ఎంపిక చేయాలనుకున్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా మేం అతని అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేశాం. అతను ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఫెయిలైనప్పుడు కూడా ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేసి అండగా నిలిచాం. కొన్ని కాంబినేషన్స్‌ నేపథ్యంలో అతన్ని ప్రపంచకప్‌ తుది జట్టులోకి తీసుకోలేకపోయాం. అంత మాత్రానా సెలక్షన్‌ కమిటీ పక్షపాతంగా వ్యవహరించదనడం తగదు.’ అని పేర్కొన్నారు.

ప్రపంచకప్‌ తుది జట్టులో చోటు ఖాయమని భావించిన రాయుడికి ఆఖరి నిమిషంలో విజయ్‌శంకర్‌ రూపంలో నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌ త్రీ డైమన్షన్స్‌ నేపథ్యంలో ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే ప్రసాద్‌ అప్పట్టో వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు 3డీ గ్లాస్‌ను ఆర్డర్‌ చేశానని కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. ధావన్‌, విజయ్‌ శంకర్‌ గాయపడి స్వదేశం చేరుకున్నా.. స్టాండ్‌ బై ఆటగాడిగా ఉన్న రాయుడిని కాదని సెలక్టర్లు మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం ఇచ్చారు. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

చదవండి: విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top