'ఎంఎస్ ధోని తప్పుకోవాలి' | Sakshi
Sakshi News home page

'ఎంఎస్ ధోని తప్పుకోవాలి'

Published Mon, Nov 6 2017 11:26 AM

MS Dhoni

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్ లో భాగంగా ట్వంటీ 20 ఫార్మాట్ నుంచి టీమిండియా జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇక తప్పుకునే సమయం ఆసన్నమైందని అంటున్నాడు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. ట్వంటీ 20 ఫార్మాట్ నుంచి ధోనినే స్వతహాగా తప్పుకోవాలంటూ లక్ష్మణ్ సూచించాడు. ఈ పొట్టి ఫార్మాట్ నుంచి ధోని తప్పుకుని యువ క్రికెటర్లు ఆడేందుకు అవకాశం కల్పించాలన్నాడు. కేవలం వన్డే ఫార్మాట్ కు మాత్రమే పరిమితమై ట్వంటీ 20ల నుంచి వైదొలిగే ఆలోచనను ధోని పరిశీలిస్తే బాగుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు

'ట్వంటీ 20ల్లో ధోని నాల్గో నంబర్ లో బ్యాటింగ్ కు వస్తున్నాడు. ఈ సమయంలో బ్యాటింగ్ కు వచ్చేటప్పుడు క్రీజ్ లో కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆస్కారం ఉండదు. కాకపోతే ధోని ఇక్కడ ఎక్కువసమయం తీసుకున్న తరువాత కానీ గాడిలో పడటం లేదు. కివీస్ తో శనివారం నాటి మ్యాచ్ నే చూడండి. ఒకవైపు విరాట్ కోహ్లి దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తే, ధోని మాత్రం స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. కోహ్లి స్ట్రైక్ రేట్ 160 ఉండగా, ధోని స్టైక్ రేట్ 80 మాత్రమే ఉంది.  టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఈ తరహా బ్యాటింగ్ సరిపోదు. నా వరకూ అయితే టీ 20ల నుంచి ధోని తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలి'అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

Advertisement
Advertisement