ఎవడ్రా అక్కడ.. ధోనికి వయసు అయిపోయిందన్నది!

MS Dhoni 111 Metre Long Sixer That Crossed the Stadium - Sakshi

కొడితే స్టేడియం బయటపడ్డది

బెంగళూరు : ‘ఎవడ్రా అక్కడ.. భారత సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి వయసు అయిపోయింది.. రిటైర్మెంట్‌ తీసుకోవాలని మాట్లాడింది. వారంతా ఈ ఒక్క షాట్‌ చూడండి.. ధోనికి వయసు అయిపోయిందో లేదో తెలుస్తోంది.’ అని అతని అభిమానుల నోట వస్తున్న మాట. అయినా ఆటకు వయసుతో సంబంధం లేదని, ఆడే ఇష్టం ఉంటే సత్తా చాటొచ్చని ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాడు. కానీ నిన్న(ఆదివారం) రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని ప్రదర్శన అద్భుతమైతే.. అతను కొట్టిన ఓ భారీ షాట్‌ అత్యద్భుతం. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఫైనల్‌ ఓవర్‌లో ధోని కొట్టిన ఆ షాట్‌కు మైదానంలో ఆటగాళ్లు, ప్రేక్షకులతో పాటు టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకుల కళ్లు సైతం జిగేల్‌మన్నాయి. ఇక కామెంటేటర్స్‌ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎగిరి గంతేసినంత పనిచేశారు. 

ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఆఖరి ఓవర్లో ధోని వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 2, 6తో 24 పరుగులు పిండుకున్నాడు. అయితే ఇందులో కొట్టిన రెండో బంతి సిక్స్‌ అయితే ఏకంగా 111 మీటర్ల దూరంలో స్టేడియం బయటపడింది. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో.. ‘ఇప్పుడు చెప్పండ్రా..ధోని హేటర్స్‌’  అనే వాట్సాప్‌స్టేటస్‌లతో  నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని షాట్‌ గురి తప్పడం... పరుగు కోసం ప్రయత్నించడం... బెంగళూరు కీపర్‌ పార్థివ్‌ డైర్టెక్‌ హిట్‌తో శార్దుల్‌ను రనౌట్‌ చేయడంతో చెన్నై పరాజయం పాలైంది.. ధోని (48 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌ వృథా అయింది.  

ఇక టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పార్థివ్‌ పటేల్‌ (37 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ కోహ్లి (9), ఏబీ డివిలియర్స్‌ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించలేకపోయారు. మొయిన్‌ అలీ (16 బంతుల్లో 26; 5 ఫోర్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top