
విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ రాకెట్స్ సంఘం అధ్యక్షునిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌లో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ రెడ్డి, కోశాధికారిగా ఎ.మహేష్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్‌కే పురుషోత్తంతో పాటు 12 జిల్లాల నుంచి అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికైన కార్యవర్గం 2023 వరకు కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంపీగా రాజ్యసభలో తన వాణిని ధాటిగా వినిపించే ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పోర్ట్స్ రంగంలో రావడం శుభపరిణామం అని పురుషోత్తం పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను విజయసాయిరెడ్డి తీసుకోవాలని ఆకాంక్షించారు.