20 ఏళ్లు...  200 వన్డేలు 

Mithali Raj completes 200 ODIs to set new record in women's cricket - Sakshi

పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే, 16 ఏళ్ల చిరు ప్రాయంలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హైదరాబాదీ అమ్మాయి మిథాలీరాజ్‌... న్యూజిలాండ్‌పై మూడో వన్డేతో 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు నమోదు చేసింది. ఈ క్రమంలో కుదుపులతో పాటు ఎత్తుపల్లాలను చవిచూసింది. 1999 జూన్‌లో ఇంగ్లండ్‌లోని మిల్టన్‌ కేన్స్‌లో ఐర్లాండ్‌పై ఆడిన తొలి వన్డేలోనే అజేయ శతకం బాది అందరి దృష్టినీ ఆకర్షించిన మిథాలీ... ఇన్నేళ్ల కెరీర్‌లో, ఇన్ని ఘనతలు సాధించిన తర్వాత కూడా వినమ్రంగా ఉంటూ హుందాగా వ్యవహరిస్తోంది. ఇటీవలి టి20 ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ వివాదం తర్వాత ఆమె స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ స్థాయిలో కాలం, పరిస్థితులు, ప్రమాణాలకు తగినట్లు ఆట తీరులో మార్పులు చేసుకుంటూ మనగలుగుతోంది. ‘నా తొలి  లక్ష్యం భారత జెర్సీ ధరించడం, జట్టు కీలక సభ్యుల్లో ఒకరిగా ఎదగడమే.

కానీ, ఇంతవరకు వస్తానని ఊహించలేదు. 200 అనేది కేవలం ఓ అంకె మాత్రమే. అయినా ఆ ఘనత అందుకోవడం బాగుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐడబ్ల్యూసీసీ) నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) పరిధిలోకి రావడం సహా మహిళా క్రికెట్‌లో అనేక పరిణామాలు చూశా. ఈ మార్పు ఫలితమేంటో అందరికీ తెలుసు. ఇన్నేళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషాన్నిస్తోంది. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అని మిథాలీ పేర్కొంది. ఈ హైదరాబాదీ వన్డేల్లో 6,622 పరుగులు, 10 టెస్టుల్లో 663 పరుగులు, 85 టి20ల్లో 2283 పరుగులు చేసింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల రికార్డు మిథాలీ పేరిటే ఉంది. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top