కశ్మీర్‌ గురించి మనకెందుకు?: పాక్‌ కోచ్‌

Misbah ul Haq Shuts Down Question On Kashmir - Sakshi

కరాచీ:  జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పలువురు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు మండిపడిన సంగతి తెలిసిందే.  కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, దీనిపై ఐక‍్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని పాక్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది ధ్వజమెత్తగా,  ఇది కశ్మీర్‌ ప్రజలకు కష్ట కాలంగా సర్పరాజ్‌ అభివర్ణించాడు. కశ్మీర్‌ ప్రజలకు యావత్‌ పాకిస్తాన్‌ అండగా ఉంటుందంటూ పేర్కొన్నాడు.

అయితే ఇటీవల పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డ ఆ దేశ మాజీ క్రికెటర్‌ మిస్బావుల్‌ హక్‌ మాత్రం కశ్మీర్‌ అంశం గురించి మాట్లాడటానికి నిరాకరించాడు. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు సిద్ధమైన తరుణంలో మిస్బావుల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా కశ్మీర్‌పై అభిప్రాయం చెప్పమని ఒక విలేకరి అడిగాడు. దీనికి మిస్బావుల్‌ సమాధానమిస్తూ‘ మనం క్రికెట్‌ గురించి మాట్లాడదాం. కశ్మీర్‌పై యావత్‌ పాకిస్తాన్‌ కరుణ చూపెడుతుంది. కానీ మనం మాత్రం క్రికెట్‌ గురించే చర్చిద్దాం. క్రికెట్‌ ఆడటానికే ఇక్కడికి వచ్చాం కదా. కశ్మీర్‌పై మనం మాట్లాడటానికా ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌’ అని కాస్త తెలివిగా సమాధానం చెప్పాడు.

ఈ రోజు పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల కరాచీలో తొలి వన్డే జరగాల్సి ఉండగా, అందుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దాంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్‌ పర్యటనకు తాము రాలేమంటే సీనియర్‌ క్రికెటర్లు లసిత్‌ మలింగా, దిముత్‌ కరుణరత్నేలతో పాటు మరో 8మంది తేల్చిచెప్పడంతో శ్రీలంక జట్టు జూనియర్‌ జట్టుతో సిద్ధమైంది. ప్రస్తుతం పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్లలో చాలా మంది యువ క్రికెటర్లే ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top