వారెవ్వా.. స్వర్ణం, రజతం రెండు మనకే!

Manjit Singh Wins Gold And Jinson Johnson Silver In Men 800m - Sakshi

800 మీటర్ల విభాగంలో మెరిసిన భారత అథ్లెట్స్‌

26 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో స్వర్ణం

ట్విటర్‌లో ప్రశంసించిన వైఎస్‌ జగన్‌

జకార్త: ఏషియన్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్స్‌ అదరగొట్టారు. పురుషుల 800 మీటర్ల విభాగంలో స్వర్ణం, రజతం రెండు పతకాలను సొంతం చేసుకున్నారు. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత రన్నర్స్‌ మన్‌జిత్‌ సింగ్‌, జిన్సన్‌ జాన్సన్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మన్‌జిత్‌ (1:46:15 )లో పరుగు పూర్తి చేసి పసిడి దక్కించుకోగా.. జిన్సన్‌ జాన్సన్‌ (1:46: 35)సెకన్లలో పరుగు పూర్తి చేసి రజతం కైవసం చేసుకున్నాడు. ఖతర్‌కు చెందిన అబ్దల్లా అబుబేకర్‌ (1:46:38)కు కాంస్యం వరించింది. 1962 తర్వాత 800 మీటర్ల విభాగంలో భారత ఆటగాళ్లు రెండు పతకాలు నెగ్గడం విశేషం. ఇక 26 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ విభాగంలో స్వర్ణం దక్కడం మరో విశేషం. 1951లో తొలిసారి భారత ఆటగాళ్లు రంజీత్‌ సింగ్‌ (గోల్డ్‌), కుల్వంత్‌ సింగ్‌ (రజతం) నెగ్గగా.. 1962లో దల్జిత్‌ సింగ్‌ సిల్వర్‌, అమ్రిత్‌ పాల్‌ కాంస్య పతకాలు నెగ్గారు. తాజాగా మన్‌జిత్‌ సింగ్‌, జిన్సన్‌ జాన్సన్‌ ఆ జాబితాలో చేరి రికార్డు సృష్టించారు.

బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి  తై జు యింగ్(చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్నారు. ఇక సెమీస్‌లో ఓడిన సైనా కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. ఆర్చరీ కాంపౌడ్‌ టీమ్‌ విభాగంలో భారత మహిళల, పురుషుల జట్లు రజతం పతకాలను గెలిచాయి. జావెలిన్‌ త్రోలో అనురాణి పోరాటం ముగిసింది. ఫైనల్లో ఆమె ఆరోస్థానంతో సరిపెట్టుకున్నారు.

మిక్స్‌డ్‌ 4x400m రిలే విభాగంలో రజతం
మిక్స్‌డ్‌ 4x400m రిలే విభాగంలో తొలిసారి భారత జట్టుకు పతకం వరించింది. ముహమ్మద్‌ అనస్‌ యాహియా, పూవమ్మ మచెట్టేరి, హిమదాస్‌, రాజీవ్‌ అరోకియాల బృందం 3:15.71 సమయంలో లక్ష్యాన్ని చేరుకొని రెండో స్థానంలో నిలిచారు. దీంతో భారత్‌కు రజతం వరించింది. బెహ్రెయిన్‌(3:11.89) జట్టుకు స్వర్ణం, కజకిస్తన్‌(3:19.52)కు కాంస్యం లభించింది.

అయ్యో హిమదాస్‌...
400 మీటర్ల విభాగంలో రజతం సొంతం చేసుకున్న హిమదాస్‌.. 200 మీటర్ల విభాగంలో డిస్‌క్వాలిఫై అయ్యారు. సెమీస్‌2 రేసులో ఆమె ఫాల్స్‌ స్టార్‌ చేయడంతో రిఫరీలు అనర్హురాలిగా ప్రకటించారు. ఇదే విభాగంలో సెమీస్‌ అర్హత సాధించిన 100 మీటర్ల రజత విజేత ద్యుతిచంద్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. 9 స్వర్ణాలు, 19 రజతాలు, 22 కాంస్యాలతో మొత్తం భారత పతకాల సంఖ్య 50కి చేరింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ 9వ స్థానంలో నిలిచింది.

 వైఎస్‌ జగన్‌ ప్రశంసలు..
ఏషియన్‌గేమ్స్‌లో సత్తా చాటిన భారత అథ్లెట్స్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రశంసించారు. భారత బృందం అద్భుత ప్రదర్శన కనబర్చిందని కొనియాడారు. ప్రతి ఒక్కరి గెలుపు తమకు గర్వంగా ఉందని ట్వీట్‌ చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top