అరంగేట్రం అదుర్స్‌.. భారత్‌ పతనాన్ని శాసించాడు! | Lungi Ngidi is second bowler to take a five on his first Test | Sakshi
Sakshi News home page

అరంగేట్రం అదుర్స్‌.. భారత్‌ పతనాన్ని శాసించాడు!

Jan 17 2018 7:47 PM | Updated on Jan 17 2018 9:46 PM

Lungi Ngidi is second bowler to take a five on his first Test - Sakshi

సెంచూరియన్‌ : దక్షిణాఫ్రికా గడ్డ మీద ఆతిథ్య జట్టుపై టీమిండియాకు టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని అందించడంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విఫలమయ్యాడు. నేడు జరిగిన రెండో టెస్టులో టీమిండియాను ఓడించిన ప్రొటీస్‌ జట్టు మరో మ్యాచ్‌ మిగిలుండగానే  2-0తో టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే సెంచూరియన్‌ టెస్టులోనే అరంగేట్రం చేసిన సౌతాఫ్రికా యువ సంచలనం, పేసర్‌ లుంగిసాని ఎంగిడి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఆడుతున్నది తొలి టెస్టు.. అందులోనూ టెస్టుల్లో నెంబర్‌ వన్‌ టీమ్‌ భారత్‌తో ఆట అంటే అంత తేలిక కాదు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే వికెట్‌ తీసినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అందుకు ఈ యువ పేసర్‌ గణాంకాలే (6/39) నిదర్శనంగా నిలిచాయి. తద్వారా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు ఎంగిడి. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఎంగిడి తొలిటెస్టులోనే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు.

అరంగేట్ర టెస్టులోనే భారత్‌ జట్టుపై ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. 21 ఏళ్ల తర్వాత ఈ ఫీట్‌ సాధించడం గమనార్హం. 1996లో భారత్‌తో జరిగిన కోల్‌కతా టెస్టులో సఫారీ అరంగేట్ర బౌలర్‌ లాన్స్‌ క్లూసెనర్‌ తొలి వికెట్ల ఇన్నింగ్స్‌ (8/64)తో రాణించాడు. కీలకమైన ప్రత్యర్థి జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనే ఈ అరంగేట్ర బౌలర్లు రాణించి తమ జట్టుకు విజయాన్ని అందించారు. పార్థీవ్‌ పటేల్‌ వికెట్‌తో ఎంగిడి తన తొలి టెస్టు వికెట్‌ సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, హార్థిక్‌ పాండ్యాతో పాటు అశ్విన్‌, షమీ, బూమ్రా వికెట్లు తీసి భారత్‌ ఓటమిని శాసించాడు. ఈ 24న ప్రారంభంకానున్న నామమాత్రమైన మూడో టెస్టులోనూ యువ సంచలనం ఎంగిడి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement