కోల్‌‘కథ’ పునరావృతమయ్యేనా! | Kolkata Knight Riders trying to win third time | Sakshi
Sakshi News home page

కోల్‌‘కథ’ పునరావృతమయ్యేనా!

Apr 6 2015 12:32 AM | Updated on Sep 2 2017 11:54 PM

కింగ్ ఖాన్ షారూక్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జూహీ చావ్లా భాగస్వామ్యంతో 2008 ఐపీఎల్‌లో కోల్‌కతా ఫ్రాంచైజీగా, గంగూలీ కెప్టెన్‌గా నైట్‌రైడర్స్ జట్టును ఏర్పాటు చేశారు.

మూడోసారి టైటిల్‌పై కన్ను
గంభీర్, నరైన్‌పైనే ఆశలు
అనుభవం లేని స్థానిక ఆటగాళ్లు

ఓనర్: షారూక్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతా
కెప్టెన్: గౌతమ్ గంభీర్
కోచ్: ట్రెవర్ బేలిస్
గతంలో ఉత్తమ ప్రదర్శన: 2012, 14 చాంపియన్

 
యజమానులుగా బాలీవుడ్ సెలబ్రిటీలు... జట్టుకు కావాల్సినంత ప్రజాదరణ... దాదాపుగా తొలి ఏడాదే లాభాలబాట పట్టిన టీమ్... అయినా సరే ఐపీఎల్‌లో మొదటిసారి విజేతగా నిలవడానికి నాలుగేళ్లు సమయం తీసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్... ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. సమష్టి మంత్రంతో తమ జైత్రయాత్ర కొనసాగిస్తున్న నైట్‌రైడర్స్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి టైటిల్‌పై కన్నేసింది. ఈసారీ  షారూక్ బృందం గతేడాది ‘కథ’ను పునరావృతం చేస్తుందా? లేదా చూడాలి.             - సాక్షి క్రీడా విభాగం
 
కింగ్ ఖాన్ షారూక్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ జూహీ చావ్లా భాగస్వామ్యంతో 2008 ఐపీఎల్‌లో కోల్‌కతా ఫ్రాంచైజీగా, గంగూలీ కెప్టెన్‌గా నైట్‌రైడర్స్ జట్టును ఏర్పాటు చేశారు. దీంతో లీగ్ తొలి ఏడాదే నైట్‌రైడర్స్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు ఊహించని రీతిలో స్పాన్సర్లు రావడంతో దాదాపుగా జట్టు లాభాల్లోకి వచ్చేసింది. అయితే మైదానం వెలుపలా అంతా బాగానే ఉన్నా... ఆటలోకి వచ్చేసరికి కేకేఆర్ నిరాశపర్చింది.

తొలి మ్యాచ్‌లో మెకల్లమ్ విధ్వంసంతో ఒక్కసారిగా హైప్ పెరిగినా... తర్వాతి మ్యాచ్‌ల్లో అనుభవలేమితో ఇబ్బందులు పడింది. దీంతో 14 మ్యాచ్‌లకు ఆరింటిలో గెలిచింది. 2009లో మెకల్లమ్ సారథ్యంలోని నైట్‌రైడర్స్ ప్రదర్శన మరింత దిగజారింది. వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడటంతో ఆటగాళ్లు కోలుకోలేకపోయారు. 2010 ట్రేడింగ్‌లో మనోజ్ తివారిని, వేలంలో బాండ్‌ను తీసుకొని గంగూలీకి మరోసారి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈడెన్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో దాదాపుగా గెలిచినా... బయటి మ్యాచ్‌ల్లో మాత్రం ఓటమిపాలైంది.

దీంతో 7 విజయాలతోనే మరోసారి పాయింట్ల పట్టికలో వరుసగా రెండోసారి అట్టడగు స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా మూడు సీజన్లలో గ్రూప్ దశను దాటలేకపోయిన కోల్‌కతా 2011 సీజన్ కోసం జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. రికార్డు ధరకు గంభీర్‌ను కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించింది. 15 మ్యాచ్‌ల్లో 8 గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించి కాస్త గాడిలో పడింది. 2012 సీజన్ కోసం మెకల్లమ్, నరైన్, లాంగ్‌వెల్ట్‌లను తీసుకున్న కోల్‌కతా ఆరంభంలో నిరాశపర్చినా... తర్వాతి మ్యాచ్‌ల్లో విశ్వరూపం చూపెట్టింది.

లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌లో ఢిల్లీపై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది.  టైటిల్ పోరులో చెన్నైని ఓడించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో 2013 సీజన్‌ను మొదలుపెట్టినా... పది మ్యాచ్‌ల్లో ఓడి గ్రూప్ దశకే పరిమితమైంది.

ఇద్దర్ని కొనసాగించి...

2014 సీజన్ కోసం కెప్టెన్ గంభీర్‌తో పాటు నరైన్‌ను తమ వద్దే అట్టిపెట్టుకున్న కోల్‌కతా వేలంలో మళ్లీ కలిస్, పఠాన్, షకీబ్, బిస్లా, టెన్‌డస్కెట్‌లను దక్కించుకుంది. ఉతప్ప, మనీష్ పాండే, మోర్నీ మోర్కెల్, ఉమేశ్, చావ్లా, వినయ్ కుమార్, క్రిస్ లిన్‌లను కొత్తగా జట్టులోకి వచ్చారు.

యూఏఈలో జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ముంబైపై గెలిచినా... తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. అయితే లీగ్ భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత ఉతప్పను ఓపెనర్‌గా ప్రమోట్ చేసిన కోల్‌కతా అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను ఓడించి రెండోసారి ఫైనల్లోకి వెళ్లింది. ఇక టైటిల్ పోరులో పంజాబ్‌పై 3 వికెట్ల తేడాతో నెగ్గి రెండోసారి విజేతగా నిలిచింది.

ఈసారి స్వల్ప మార్పులే...

ఎనిమిదో సీజన్ కోసం కోల్‌కతా జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. దీంతో ఫిబ్రవరిలో జరిగిన వేలంపై కూడా పెద్దగా దృష్టిసారించలేదు. స్థానిక ఆటగాళ్లను తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపింది. అయితే ఇప్పటి వరకు ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడని కేసీ కరియప్ప కోసం కోట్లు వెచ్చించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల గంభీర్, టెన్‌డస్కెట్, ఉతప్పలతో పాటు ఆల్‌రౌండర్లు షకీబ్, మోర్నీ మోర్కెల్, యూసుఫ్ పఠాన్, నరైన్‌లు అత్యంత కీలకం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement