ఫైనల్‌కు శ్రీకాంత్‌

Kidambi Srikanth enters first final since 2017 - Sakshi

సెమీస్‌లో ఓడిన సింధు, కశ్యప్‌ 

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ 

న్యూఢిల్లీ: తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్‌ ఒక మేజర్‌ టోర్నీలో ఎట్టకేలకు ఫైనల్‌ చేరాడు. 17 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత తాజా ఇండియా ఓపెన్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించాడు. 2017 అక్టోబర్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచాక మరే ఇతర బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్, బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టోర్నీల్లో ఫైనల్‌ చేరలేకపోయాడు. గతేడాది కామన్వెల్త్‌గేమ్స్‌లో ఫైనల్లోకి అడుగుపెట్టి రజతంతో సరిపెట్టుకున్నాడు. మరో వైపు భారత టాప్‌స్టార్, రెండో సీడ్‌ పీవీ సింధుతో పాటు పారుపల్లి కశ్యప్‌కు సెమీ ఫైనల్లోనే చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో శ్రీకాంత్‌ 14–21 21–16, 21–19తో చైనాగోడ హువాంగ్‌ యుజియంగ్‌ను దాటేశాడు. మూడు గేమ్‌ల పాటు జరిగిన ఈ పోరులో మూడో సీడ్‌ శ్రీకాంత్‌కు గట్టి పోటీ ఎదురైంది. ప్రత్యర్థి జోరుతో తొలి గేమ్‌ను కోల్పోయిన ఏపీ ఆటగాడు రెండో సెట్‌లో పట్టుదలగా శ్రమించాడు. ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని చాటాడు.

8–4తో ఆధిక్యంలోకి వచ్చిన 26 ఏళ్ల శ్రీకాంత్‌ స్మాష్, క్రాస్‌కోర్ట్‌ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. హువాంగ్‌ను అదేస్కోరుపై నిలువరించి 11–4తో దూసుకెళ్లాడు. రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌ హోరాహోరీగా జరిగింది. దీంతో స్కోరు 18–18తో సమమైంది. ఈ దశలో ప్రత్యర్థి పొరపాట్ల నుంచి లబ్దిపొందిన శ్రీకాంత్‌ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో భారత ఆటగాడు... డెన్మార్క్‌కు చెందిన రెండో సీడ్‌ విక్టర్‌ అక్సెల్సన్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో సెమీఫైనల్లో  అక్సెల్సన్‌ వరుస గేముల్లో పారుపల్లి కశ్యప్‌ను ఇంటిదారి పట్టించాడు. భారత ఆటగాడు 11–21, 17–21తో విక్టర్‌ అక్సెల్సన్‌ ధాటికి తలవంచాడు. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ పూసర్ల వెంకట సింధు పోరాడి ఓడింది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో ఆమె 21–23, 18–21తో మూడో సీడ్‌ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓటమి పాలైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top