గుడ్‌బై ‘హీరో’! | kalis departs with win | Sakshi
Sakshi News home page

గుడ్‌బై ‘హీరో’!

Dec 31 2013 1:33 AM | Updated on Sep 2 2017 2:07 AM

గుడ్‌బై ‘హీరో’!

గుడ్‌బై ‘హీరో’!

ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ...గెలుపుతో ముగింపు...నంబర్‌వన్ జట్టు సభ్యుడిగా రిటైర్మెంట్...ఒక దిగ్గజ క్రికెటర్ తన 18 ఏళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది? దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్విస్ కలిస్‌కు అతని స్థాయికి తగినట్లుగా ఘనమైన వీడ్కోలు లభించింది

 ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ...గెలుపుతో ముగింపు...నంబర్‌వన్ జట్టు సభ్యుడిగా రిటైర్మెంట్...ఒక దిగ్గజ క్రికెటర్ తన 18 ఏళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది? దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్విస్ కలిస్‌కు అతని స్థాయికి తగినట్లుగా ఘనమైన వీడ్కోలు లభించింది. తొలి మ్యాచ్ ఆడిన డర్బన్ మైదానంలోనే అతను ఆటను ముగించాడు. సఫారీల విజయప్రస్థానంలో అసలు సిసలు హీరో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పటికే అంతర్జాతీయ టి20లకు దూరంగా ఉంటున్న కలిస్... వచ్చే ప్రపంచకప్ వరకు వన్డేలు ఆడాలని అనుకుంటున్నాడు.
 
 కలిస్‌ను ఆడించాలనుకున్నా...
 దక్షిణాఫ్రికా విజయలక్ష్యం మరీ చిన్నది కావడంతో కలిస్‌కు మళ్లీ బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఒక వేళ తొలి వికెట్ పడితే ఆమ్లా కంటే ముందు కలిస్‌నే పంపించేందుకు డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా సిద్ధమయ్యారు కూడా. కానీ ఓపెనర్లే విజయాన్ని పూర్తి చేశారు. జట్టు గెలిచాక కలిస్ జాతీయ జెండా పట్టుకొని సహచరులతో బయటికి వచ్చాడు. ముందుగా కెప్టెన్ స్మిత్ అతడిని ఎత్తుకోగా...ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు తమ భుజాలపై మోసి స్టేడియం అంతా తిప్పారు. మైదానంలో ప్రేక్షకుల సంఖ్య మరీ పెద్దగా లేకపోయినా అన్ని చోట్లా ‘కింగ్ కలిస్’, ‘సెల్యూట్ కలిస్’, ‘ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్’ బ్యానర్లు కనిపించాయి. కలిస్‌కు గౌరవసూచకంగా దక్షిణాఫ్రికా క్రికెటర్లంతా అతని ఫోటో ముద్రించిన ప్రత్యేకమైన టీ షర్ట్‌లు ధరించారు. దాని వెనుక వైపు ‘10 వేలకు పైగా పరుగులు చేసి, 200కు పైగా వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్’ అని రాసి ఉండటం విశేషం. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా కలిస్ తనకు కెరీర్‌లో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
 
 ‘రిటైర్మెంట్ కఠిన నిర్ణయమే అయినా ఇదో అద్భుత ప్రయాణం. నాకు అండగా నిలిచిన బోర్డు, ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు నా కృతజ్ఞతలు. అందరికంటే ఎక్కువగా మా అమ్మా, నాన్న గర్వపడేలా చేశానని మాత్రం నమ్ముతున్నాను. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఆటగాళ్ల సాహచర్యం కోల్పోవడం బాధ కలిగిస్తోంది. నాకు లభించిన వీడ్కోలు చాలా సంతోషాన్నిచ్చింది. నన్ను అర్థం చేసుకునే ‘గర్ల్‌ఫ్రెండ్స్’ ఉండటం నాకు కలిసొచ్చింది. ’      -కలిస్
 
 టెస్టుల్లో స్టెయిన్ 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. స్టెయిన్ 69 టెస్టుల్లో ఈ ఘనత సాధించి మురళీధరన్ (66) తర్వాత హ్యడ్లీతో పాటు రెండో స్థానంలో నిలిచాడు.
 
 ‘అంపైర్లు ఇచ్చిన రెండు తప్పుడు నిర్ణయాలు, మంచి షాట్స్ ఆడకపోవడం కూడా ఓటమికి కారణాలు. మ్యాచ్‌లో కొన్ని మానవ తప్పిదాలు ఉండాలి.  తప్పులు చేయడం కూడా మ్యాచ్‌లో ఓ భాగమే. ఏదేమైనా యువ జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది. ’     - ధోని
 
 టెస్టుల్లో కలిస్
 మ్యాచ్‌లు:     166
 ఇన్నింగ్స్:     280
 పరుగులు:     13,289
 అత్యధిక స్కోరు:     224
 సగటు:               55.37
 సెంచరీలు:     45
 అర్ధ సెంచరీలు:    58
 క్యాచ్‌లు:     200
 వికెట్లు:               292
 సగటు:           32.65
 అత్యుత్తమ బౌలింగ్: 6/54 (ఇన్నింగ్స్‌లో), 9/92 (టెస్టులో)
 ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు: 5 సార్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement