జూనియర్లు కావాలిక సీనియర్లు  | Juniors excavator seniors - Coach Rahul Dravid | Sakshi
Sakshi News home page

జూనియర్లు కావాలిక సీనియర్లు 

Feb 6 2018 1:05 AM | Updated on Feb 6 2018 1:05 AM

Juniors excavator seniors -  Coach Rahul Dravid - Sakshi

ఐసీసీ అండర్‌–19 ప్రపంచకప్‌ విజేత

ముంబై: ఐసీసీ అండర్‌–19 ప్రపంచకప్‌ విజేతలుగా నిలిచే అర్హత తమ కుర్రాళ్లకే ఉందని భారత జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. టోర్నీ మధ్యలో ఐపీఎల్‌ వేలం కాస్త ఇబ్బందికరమైనా... కుర్రాళ్లు ఆ ఛాయలు కనిపించకుండా తొందరగానే బయటపడ్డారని చెప్పారు. క్వార్టర్స్, సెమీస్‌ మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఫైనల్లో నంబర్‌వన్‌ ఆట ఆడలేదన్నారు. అయితే గత ఏడాదిన్నర నుంచి జట్టు సన్నద్ధమైన తీరు అద్భుతమని కితాబిచ్చారు. ప్రణాళికతో సిద్ధమైన యువ జట్టు ఆటలో పక్కా ప్రణాళికతోనే ఒక్కో మ్యాచ్‌ను గెలిచిందని, చివరకు కప్‌ కూడా సాధించడం గర్వంగా ఉందని అన్నారు. ‘టీమ్‌ వర్క్‌తోనే విజయవంతమయ్యాం. ఎన్‌సీఏలో శిబిరాలు, బీసీసీఐ ఏర్పాటు చేసిన మ్యాచ్‌లు, సిరీస్‌లు అన్నీ టైటిల్‌ గెలిచేందుకు దోహదపడ్డాయి. కుర్రాళ్లు ఈ విజయంతో ఆగిపోవద్దు. ఇక అండర్‌–23, సీనియర్‌ టీమిండియా లక్ష్యంగా వారందరూ కష్టపడాలి’ అని ద్రవిడ్‌ చెప్పారు. 

వారి కృషి ఫలితమే... 
యువ సేనను చాంపియన్లుగా చేసేందుకు కోచ్‌ ద్రవిడ్‌ అండ్‌ కో ఎంతో చెమటోడ్చిందని భారత అండర్‌–19 సారథి పృథ్వీ షా అన్నాడు. ప్రపంచకప్‌లో తాను ధరించిన జెర్సీ నంబర్‌ 100పై ఎలాంటి మూఢవిశ్వాసం లేదన్నాడు. నాలుగో ప్రపంచకప్‌ సాధించిన యువ భారత జట్టు సోమవారం స్వదేశానికి చేరుకుంది. ఇక్కడి ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కుర్రాళ్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ఉన్నతాధికారులు స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతరం కెప్టెన్‌ పృథ్వీ షా మీడియాతో మాట్లాడుతూ ‘వరల్డ్‌కప్‌లో మాకు ఎన్నో మధురానుభూతులున్నాయి. వాటిని మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా నేనైతే ప్రపంచకప్‌లో విజయవంతమైన సారథిగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని అన్నాడు. గత రెండు, మూడేళ్లుగా తానెంతో కష్టపడ్డానని షా చెప్పాడు. రంజీ, దులీప్‌ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే సెంచరీలు బాదిన పృథ్వీ షా ఇదంతా అనుభవంతోనే సాధ్యపడిందన్నాడు. ‘ఏడెనిమిదేళ్ల వయసులో స్కూల్‌ క్రికెట్‌ను ఆరంభిస్తాం. పాఠశాల కోచ్‌ల నుంచి ప్రస్తుత కోచ్‌ ద్రవిడ్‌ వరకు అందరితోనూ ఎంతో నేర్చుకున్నాను. వాళ్ల అనుభవం, మార్గదర్శనంతోనే నా ఆట మెరుగైంది. ఎన్ని జట్లకు ఆడినా... భారత్‌కు ఆడిన అనుభూతే వేరు. అదెంతో అనిర్వచనీయమైంది’ అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. తానీ స్థాయికి ఎదగడానికి తన తండ్రి ప్రోత్సాహం ఉందన్నాడు. ఆట నేర్చుకోవడం నుంచి మ్యాచ్‌లు ఆడటం వరకు నన్ను ఎంత దూరమైనా తీసుకెళ్లేవాడని చెప్పాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement