'స్వింగ్ సత్తా ఏంటో ఆరోజే తెలిసింది'

Irfan Pathan Recalls Hat Trick Against Pakistan In 2006 Karachi Test - Sakshi

ఢిల్లీ : భారత క్రికెట్‌ చరిత్రలో ఇర్ఫాన్‌ పఠాన్‌  హ్యాట్రిక్‌కు ప్రత్యేక స్థానముంది. 2006 జనవరిలో కరాచీ వేదికగా జరిగిన టెస్టులో తన స్వింగ్‌తో పాక్‌ను బెంబేలెత్తించాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ వేసిన పఠాన్‌ సల్మాన్‌ భట్‌, యూనిస్‌ ఖాన్‌, మహమ్మద్‌ యూసుఫ్‌లు తమ పరుగుల ఖాతా తెరవక ముందే వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. తన అద్భుతమైన ఇన్‌స్వింగర్లతో వారిని అవుట్‌ చేసి టెస్టుల్లో హ్యాట్రిక్‌ తీసిన రెండో భారత బౌలర్‌గా.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఓవర్లోనే ఈ ఫీట్‌ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కా డు. పఠాన్‌ చేసిన ఆ మ్యాజిక్‌ ఎప్పటికి గుర్తుండిపోతుంది. తాజాగా పఠాన్‌ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మరోసారి పంచుకున్నాడు.(వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ఫైనల్‌ ఫిక్స్ అయింది)

'ఆ మ్యాచ్‌ నాకింకా గుర్తు.. ఆరోజు తొలి ఓవర్‌ నేనే వేశా.. క్రీజులో సల్మాన్‌ భట్‌, ఇమ్రాన్‌ ఫర్హత్‌లు ఉన్నారు. అప్పటికే ఓవర్‌లో మూడు బంతులు వేశా.. ఇక నాలుగో బంతిని స్వింగ్‌ వేసి భట్‌ను ఔట్‌ చేయాలని భావించా. నేను వేసిన బాల్‌ను భట్‌ డిఫెన్స్‌ ఆడాడు. అది బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి బంతి కెప్టెన్‌ ద్రవిడ్ చేతిలోకి వెళ్లింది. నేనెలా అనుకుంటే అలానే జరిగింది. భట్‌ స్థానంలో వచ్చిన యూనిస్‌ ఖాన్‌ ముందు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఎలాగైనా సరే అతన్ని ఔట్‌ చేయాలనే లక్ష్యంతో  మోకాలి ఎత్తులో ఇన్‌స్వింగర్‌ వేయాలనుకున్నా. ఆ బంతి నా చేతుల్లో నుంచి వెళ్లినప్పుడే పర్‌ఫెక్ట్‌గా పడిందని నాకు తెలిసిపోయింది. ఎల్బీడబ్ల్యూ కోసం నేను అప్పీల్‌ చేస్తే అంపైర్‌ ఔటిచ్చాడు. దీంతో వరుస బంతుల్లో రెండు వికెట్లు లభించాయి.(రోహిత్‌.. నువ్వు చాలా క్యూట్‌: చహల్‌)

ఎలాగైనా హ్యాట్రిక్‌ సాధించాలనే ఉద్దేశంలో  మరో ఇన్‌స్వింగర్‌ వేయడానికే ప్రాధాన్యత ఇచ్చా. అయితే నేను ఇన్‌స్వింగర్‌ వేస్తానని ముందే ఉహించిన యూసఫ్‌ దానికి తగ్గట్లుగానే సిద్ధమయ్యాడు. అయితే నేను కూడా ఊహించని విధంగా బంతి మరింత ఎక్కువ ఇన్‌స్వింగ్‌ అయి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది.. దీంతో యూసుఫ్‌ బౌల్డయ్యాడు. అలా నా నా హ్యాట్రిక్‌  పూర్తయింది. స్వింగ్‌ బౌలింగ్‌ నాకు ఊరికే ఏం రాలేదు.. దాని కోసం ఎన్నో రోజులు కష్టపడ్డా. ఇన్‌స్వింగర్ల ద్వారా హ్యాట్రిక్‌ తీసిన నాకు నా స్వింగ్‌ సత్తా ఏంటో ఆరోజే తెలిసింది. ఆ హ్యాట్రిక్‌ ప్రపంచ రికార్డు అనే విషయం సచిన్‌ టెండూల్కర్‌ చెప్పేవరకు నాకు తెలియదు' అంటూ పఠాన్‌ చెప్పుకొచ్చాడు.


పఠాన్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 341 పరుగులు తేడాతో పరాజయం పాలై సిరీస్‌ను 0-1తేడాతో పాక్‌కు సమర్పించుకుంది. అయితే ఆ వెంటనే జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను మాత్రం 4-1 తేడాతో భారత్‌ చేజెక్కించుకోవడం విశేషం.టీమ్‌ఇండియా తరఫున 29 టెస్టులు ఆడిన ఇర్ఫాన్‌ 100 వికెట్లు తీసుకోగా.. 120 వన్డేల్లో 173వికెట్లతో రాణించాడు. 24టీ20ల్లో 28వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జనవరిలోనే క్రికెట్‌కు ఇర్ఫాన్‌  పఠాన్‌ వీడ్కోలు పలికాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top