ఢిల్లీ, చెన్నైల టార్గెట్‌ వీరే!

IPL Auction 2020: Delhi And CSK Could Target On Three Players - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 13 కోసం జరిగే ఆటగాళ్ల వేలానికి ఇంకా ఆరు రోజుల సమయమే ఉంది. దీంతో ఎనిమిది ఫ్రాంచైజీలు తమ జట్టుకు కావాల్సిన గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. గత సీజన్‌లో బయటపడ్డ బలహీనతలకు మందుగా తాజాగా జరిగే వేలాన్ని ఉపయోగించుకోవాలని పలు ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఈ అంశంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ముందు వరుసలో ఉంది. 

గత సీజన్‌లో పలు మ్యాచ్‌లు గెలుపుటంచుకు చేరుకొని అనుభవరాహిత్యంతో ఓటములను చవిచూసింది. దీంతో సీనియర్‌ క్రికెటర్స్‌ తీసుకోవాలని భావించిన ఢిల్లీ.. ఇప్పటికే అజింక్యా రహానే, రవిచంద్రన్‌ అశ్విన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లను జట్టులో చేర్చుకొని టీమ్‌ను  బ్యాలెన్స్‌ చేసింది. అయితే జట్టును మరింత పటిష్ట పరిచేందుకు జట్టు కూర్పులో భాగంగా వేలంలో ముగ్గురు క్రికెటర్లను ఎట్టిపరిస్థితుల్లో చేజిక్కించుకోవాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోందట. ఆ ముగ్గురు ఎవరంటే ఆరోన్‌ ఫించ్‌, అలెక్స్‌ క్యారీ, క్రిస్‌ వోక్స్‌. 

శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షాలతో ఢిల్లీ ఓపెనింగ్‌ చాలా బలంగా ఉంది. అయితే వీరిద్దరూ విఫలమైన సమయంలో టాపార్డర్‌ కుదేలవుతోంది. దీంతో టాపార్డర్‌లో సీనియర్‌ హిట్టర్‌ ఉంటే బాగుంటుందని భావిస్తోంది. దీంతో అంతర్జాతీయ టీ20లతో పాటు ఐపీఎల్‌ మంచి రికార్డు ఉన్న ఫించ్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక రిషభ్‌ పంత్‌కు బ్యాకప్‌ కీపర్‌గా పేరుగాంచిన మరో ఆటగాడు ఢిల్లీ జట్టులో లేడు. 

దీంతో అలెక్స్‌ క్యారీ వైపు ఆ జట్టు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను వదులుకున్న ఢిల్లీ, ప్రత్యామ్నాయంగా క్రిస్‌ వోక్స్‌ను తీసుకోవాలని అనుకుంటోందట. కగిసో రబడాతో కలిసి ఓపెనింగ్‌ బౌలింగ్‌ చేయడంతో పాటు జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్‌తో కూడా వోక్స్‌ ఆదుకుంటాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆశిస్తోందట. 

ఆ ముగ్గురిపై సీఎస్‌కే కన్ను!
ఇప్పటివరకు ఐపీఎల్‌లో సక్సెస్‌ టీమ్‌ ఏదని అభిమానులను అడిగితే వారు టక్కున చెప్పే పేరు చెన్నై సూపర్‌ కింగ్స్‌. మినిమమ్‌ ఆటతో ప్రతీ సీజన్‌లో తనదైన మార్క్‌ చూపిస్తోంది ధోని సేన. దీంతో ఈ సీజన్‌లో కూడా అభిమానులకు ఫుల్‌ జోష్‌ అందించడానికి సన్నద్దమైంది. దీనిలో భాగంగా గత సీజన్‌ కంటే జట్టు కూర్పు విభిన్నంగా ఉండేలా ప్లాన్‌ చేస్తుందట సీఎస్‌కే యాజమాన్యం. దీనిలో భాగంగా వేలంలోకి వచ్చిన క్రికెటర్లలో ఓ ముగ్గురిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిందట. ధోని ఎప్పుడూ బౌలింగ్‌లో వైవిధ్యాన్ని కోరుకుంటాడు. 

దీంతో ఈ సీజన్‌ కోసం బౌలింగ్‌ కూర్పును మార్చే ఆలోచనలో సీఎస్‌కే ఉందని టాక్‌. ఇందుకోసం బౌలర్లు పియూష్‌ చావ్లా, స్యామ్‌ కరన్‌లను తీసుకోవాలని భావిస్తోందట. వీరిద్దరికీ ఐపీఎల్‌లో మంచి రికార్డే ఉంది. ఇక షేన్‌ వాట్సన్‌, డ్వేన్‌ బ్రేవోలతో పాటు మరో ఆల్‌రౌండర్‌ కోసం సీఎస్‌కే అన్వేషిస్తోందట. దీనిలో భాగంగా మార్కస్‌ స్టోయినిస్‌పై సీఎస్‌కే కన్నేసింది. గత సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరుపున ఆడిన ఈ ఆసీస్‌ క్రికెటర్‌ అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఆటగాళ్ల ట్యాలెంట్‌ను సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకునే సారథి ధోని.. స్టోయినిస్‌ వైపు మొగ్గు చూపాడని సమాచారం. 

ఇక మరో ఆరు రోజుల్లో ఐపీఎల్‌-13 ఆటగాళ్ల వేలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరు ఎటు వెళ్తారనే ఆసక్తి ఫ్రాంచైజీలు, ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  కోల్‌కతా వేదికగా డిసెంబర్‌ 19న జరగనున్న ఈ వేలంలో 332 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న విషయం తెలిసిందే. కనీస ప్రాథమిక ధర రూ. 2 కోట్లుగా ఉన్న మ్యాక్స్‌వెల్, కమిన్స్, హాజల్‌వుడ్, మార్ష్, స్టెయిన్, మాథ్యూస్, మోరిస్‌లపై అందరి దృష్టి ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top