రాజస్తాన్‌ గెలిచి నిలిచేనా?

IPL 2019 Rajasthan Won the Toss Opt to Bowl First Against RCB - Sakshi

స్టీవ్‌ స్మిత్‌కు ఈ సీజన్‌ చివరి మ్యాచ్‌

బెంగళూరు : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ట మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఉదయం నుంచి అక్కడ వర్షం కురుస్తోంది. వరుణుడు తెరపినివ్వడంతో టాస్‌కు వేశారు. అయితే మళ్లీ జల్లులు కురుస్తుండటంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు. ప్రస్తుతం ఎక్కువ సేపు వర్షం కురిస్తే మ్యాచ్‌ను కుదించే అవకాశం ఉంది. 9.15 గంటల తర్వాత ఓవర్లు కుదిస్తారు. అయితే ఈ మ్యాచ్‌ రాజస్తాన్‌కు ఎంతో కీలకం. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే రాజస్తాన్‌ ప్లేఆఫ్‌ నుంచి తప్పుకోవడం ఖాయం. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బ్యాటింగ్‌ అనుకూలించే అవకాశం ఉండటంతో ఛేజింగ్‌కే స్మిత్‌ మొగ్గు చూపాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. టర్నర్‌ స్థానంలో స్పిన్నర్‌ మహిపాల్‌ లామ్రోర్‌కు తుదిజట్టులోకి తీసుకుంది. ఇక ఆర్సీబీ ప్లేఆఫ్‌నుంచి తప్పుకోవడంతో ఈ మ్యాచ్‌లో పలు ప్రయోగాలు చేసింది. పవన్‌ నేగిని తుది జట్టులోకి తీసుకోగా.. శివం దుబెను పక్కకు పెట్టి కుల్వంత్‌ ఖేజ్రోలియా అవకాశం కల్పించింది.. 

ఆర్సీబీకి ఇంకా అవకాశం ఉన్నట్టేనా..
12 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి బెంగళూరు దాదాపుగా నిష్క్రమించినట్లే. కాకపోతే సాంకేతికంగా ఆ జట్టు ఇంకా రేసులోనే ఉంది. ఆరు విజయాలతో ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. కాకపోతే.. పంజాబ్‌.. కోల్‌కతా చేతిలో ఓడి చెన్నైపై గెలవాలి.. కోల్‌కతా, సన్‌రైజర్స్‌లపై ముంబయి నెగ్గాలి.. రాజస్థాన్‌.. బెంగళూరు చేతిలో ఓడి, దిల్లీపై విజయం సాధించాలి.. బెంగళూరు తన ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించాలి. అద్భుతాలు జరిగి ఈ సమీకరణాలన్నీ సాధ్యమైతే.. పంజాబ్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, రాజస్థాన్‌, బెంగళూరు ఆరు విజయాలతో సమానంగా నిలుస్తాయి. వీటిలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న ఒక జట్టు నాలుగో బెర్తును సొంతం చేసుకుంటుంది.

రాజస్తాన్‌కు చావోరేవో..
రాజస్తాన్‌ రాయల్స్‌ది చాలా కఠినమైన స్థితి. నెట్‌ రన్‌రేట్‌లో వెనకబడ్డ రాజస్థాన్‌ రెండు మ్యాచ్‌లను ఇంటి బయట ఆడనుంది. బెంగళూరు, దిల్లీలపై విజయం సాధిస్తే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ఇక స్టీవ్‌ స్మిత్‌కు ఈ సీజన్‌కు చివరి మ్యాచ్‌ ఇదే కానుంది. ప్రపంచకప్‌ సన్నద్దత కోసం స్మిత్‌ ఆస్ట్రేలియాకు పయనమవనున్నాడు. విదేశీ ఆటగాళ్లు జట్టును వీడిన నేపథ్యంలో రాజస్థాన్‌ మిగతా మ్యాచ్‌ల్లో అద్భుతం చేయాల్సిందే.

తుదిజట్లు
రాజస్తాన్‌: స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), అజింక్యా రహానే, సంజూ శాంసన్‌, లివింగ్‌ స్టోన్‌, రియాన్‌ పరాగ్‌, స్టువార్టు బిన్ని, మహిపాల్‌ లామ్రోర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, వరుణ్‌ ఆరోన్‌, థామస్‌

ఆర్సీబీ: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, ఏబీ డివిలియర్స్‌, క్లాసన్‌, గుర్‌కీరత్‌ సింగ్‌, స్టొయినిస్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ, కుల్వంత్‌ ఖేజ్రోలియా, చహల్‌. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top