‘డాడీ ఆర్మీ’ అన్నారు కదా.. ఏమైంది?

IPL 2019 Dwayne Bravo Reacts On Trolling CSK For Daddy Army - Sakshi

చెన్నై: గత ఏడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టుని అందరూ ‘డాడీ ఆర్మీ’ అని ఎగతాళి చేశారు. జట్టులోని ఆటగాళ్ల వయసు సరాసరి 30 ఉండటమే దీనికి కారణం. కానీ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత ఏడాది ఫైనల్‌కి చేరిన చెన్నై.. ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే గతేడాది చివర్లో జరిగిన ఆటగాళ్ల మార్పులు, వేలంలో సీఎస్‌కే ఎక్కువ మార్పులకు చోటివ్వకుండా.. పాత జట్టువైపే మొగ్గుచూపింది. దీంతో సోషల్‌ మీడియాలో ‘డాడీ ఆర్మీ’మళ్లీ టైటిల్‌ సాదిస్తుందా అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో మళ్లీ ఆ పదం తెగ ట్రెండ్‌ అవుతోంది. అయితే దీనిపై సీఎస్‌కే స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో స్పందించాడు. 
‘మా జట్టును మళ్లీ అలానే అంటున్నారని తెలుసు, కానీ అనుభవం మించిన ఆయుధం లేదు. గతేడాది కూడా ఇలానే అన్నారు. ఏమైంది? టైటిల్‌ గెలిచాం. ప్రతీ సీజన్‌లోనూ కొత్తగా ఆడటానికి ప్రయత్నిస్తాం. ఈ సీజన్‌లో కూడా గత ఐపీఎల్‌కు మించి ప్రదర్శన చేస్తాం’ అంటూ బ్రేవో పేర్కొన్నారు. ఇక వయసు అనేది ఒక అంకె మాత్రమేనని, అనుభవం ఎంతో ముఖ్యమని సీఎస్‌కే సారథి ఎంఎస్‌ ధోని పేర్కొన్నాడు. ధోని, రాయుడు, రైనా, బ్రేవో, డుప్లెసిస్‌, వాట్సన్‌, తాహీర్‌, జాదవ్‌లతో సహా జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్లు అందరూ మూడు పదుల వయసు పై గలవారే కావడం విశేషం. 

ఇక అన్ని ఫ్రాంచైజీలతో పోలీస్తే సీఎస్‌కే విధానాలు వేరుగా ఉంటాయి. అన్ని ఫ్రాంచేజీలు ఆటగాళ్లకు యో-యో టెస్టు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎస్‌కే మాత్రం యో-యోకు దూరంగా ఉంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో పాటు అనుభవం, సత్తా కూడా ముఖ్యమే కదా అంటూ ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ పేర్కొంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top