‘త్రిస్వర్ణ’ కాంతులు... 

Indian Women Wrestlers Won Three Gold Medals At Asian Senior Wrestling - Sakshi

ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ పోటీల్లో భారత మహిళా రెజ్లర్లకు మూడు స్వర్ణాలు

పసిడి పతకాలు నెగ్గిన సరిత, దివ్య, పింకీ

న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా రెజ్లర్లు స్వర్ణ కాంతులీనారు. ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం మొదలైన మహిళల ఫ్రీస్టయిల్‌ పోటీల్లో భారత్‌కు ఒకే రోజు మూడు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. దివ్య కాక్రాన్‌ (68 కేజీలు), సరితా మోర్‌ (59 కేజీలు), పింకీ (55 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకోగా... నిర్మలా దేవి (50 కేజీలు) రజతం దక్కించుకుంది. కిరణ్‌ (76 కేజీలు) మాత్రం విఫలమైంది. ఫైనల్స్‌లో సరిత 3–2తో బాట్‌సెట్‌సెగ్‌ అల్టాంట్‌సెగ్‌ (మంగోలియా)పై... పింకీ 2–1తో డల్గున్‌ బొలోర్మా (మంగోలియా)పై గెలిచారు. నిర్మలా దేవి 2–3తో మిహో ఇగారషి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది.

68 కేజీల విభాగంలో ఐదుగురు రెజ్లర్లు మాత్రమే ఉండటంతో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. దివ్య బరిలోకి దిగిన నాలుగు బౌట్‌లలోనూ గెలిచి విజేతగా అవతరించింది. దివ్య వరుసగా 6–0తో అల్బీనా (కజకిస్తాన్‌)పై, 11–2తో డెల్‌గెరామా (మంగోలియా)పై, 8–0తో అజోదా (ఉజ్బెకిస్తాన్‌)పై, 6–4తో నరువా మత్సుయుకి (జపాన్‌)పై గెలిచి అజేయం గా నిలిచింది. ఇంతకుముందు ఆసియా చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు ఏకైక స్వర్ణం 2018లో నవ్‌జ్యోత్‌ కౌర్‌ (65 కేజీలు) రూపంలో లభించింది. ఈసారి మాత్రం ఒకేరోజు మూడు పసిడి పతకాలు లభించడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top