2 పరుగులతో... 

Indian women go down in final T20I by two runs, lose series 3-0 - Sakshi

3–0తో కివీస్‌ క్లీన్‌స్వీప్‌ ∙స్మృతి మరో మెరుపు ఇన్నింగ్స్‌

భారత జట్టు విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు కావాలి. కాస్పెరెక్‌ వేసిన తొలి మూడు బంతుల్లో మిథాలీ రాజ్, దీప్తి చెరో ఫోర్‌ బాదడంతో 9 పరుగులు రాగా, తర్వాతి రెండు బంతుల్లో 3 పరుగులు లభించాయి. ఇక చివరి బంతికి ఫోర్‌ కొడితేనే గెలుపు దక్కుతుంది. క్రీజ్‌లో ఉన్న మిథాలీ ముందుకు దూసుకొచ్చి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసినా బంతి మిడ్‌ వికెట్‌ దాటలేదు. ఫలితంగా సింగిల్‌కే పరిమితం కాగా, 2 పరుగులతో మన జట్టు ఓటమి. 3–0తో టి20 సిరీస్‌ కివీస్‌ సొంతం.   

హామిల్టన్‌: భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య పురుషులతో సమాంతరంగా సాగిన మహిళల టి20 సిరీస్‌లో కూడా కివీస్‌దే పైచేయి అయింది. రోహిత్‌ సేన ఒక మ్యాచ్‌లో గెలవగా, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ బృందం మాత్రం ఆ ఒక్క విజయమూ లేకుండా 0–3 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 2 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సోఫీ డెవిన్‌ (52 బంతుల్లో 72; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా, కెప్టెన్‌ సాటర్‌వైట్‌ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు), సుజీ బేట్స్‌ (18 బంతుల్లో 24; 5 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేయగలిగింది. స్మృతి మంధాన (62 బంతుల్లో 86; 12 ఫోర్లు, సిక్స్‌) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా... మిథాలీ రాజ్‌ (20 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు), దీప్తి శర్మ (16 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (17 బంతుల్లో 21; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. డెవిన్‌ 2 వికెట్లు పడగొట్టింది. డెవిన్, బేట్స్‌ తొలి వికెట్‌కు 33 బంతుల్లో 46 పరుగులు జోడించి కివీస్‌కు శుభారంభం అందించారు. ఆ తర్వాత డెవిన్, సాటర్‌వైట్‌ 71 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యం కూడా జట్టును మెరుగైన స్థితిలో నిలిపింది. 39 బంతుల్లో డెవిన్‌ హాఫ్‌సెంచరీ పూర్తయింది. అయితే చివర్లో భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. ఫలితంగా కివీస్‌ 21 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. 

భారత ఇన్నింగ్స్‌లో ప్రియా పూనియా (1) విఫలం కాగా... అద్భుత ఫామ్‌లో ఉన్న స్మృతి అదే జోరును కొనసాగించింది. పెటర్సన్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ఆమె... కాస్పరెక్‌ వేసిన తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు బాదింది. ఈ క్రమంలో 33 బంతుల్లోనే స్మృతి కెరీర్‌లో ఎనిమిదో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ధాటిని కొనసాగిస్తూ మెయిర్‌ ఓవర్లో కూడా ఆమె మరో మూడు ఫోర్లు కొట్టింది. అయితే అంతర్జాతీయ టి20ల్లో తన అత్యధిక స్కోరును నమోదు చేసిన అనంతరం మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో కవర్స్‌లో క్యాచ్‌ ఇచ్చింది. కెప్టెన్‌ హర్మన్‌ (2) వైఫల్యం ఇక్కడా కొనసాగగా... తొలి రెండు మ్యాచ్‌లలో అవకాశం దక్కని వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి గెలిపించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.  
   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top