ఆఖరి ఆట అపజయంతో...

New Zealand beat India by 4 runs to clinch series - Sakshi

చివరి టి20లో భారత్‌ పరాజయం

4 పరుగులతో నెగ్గిన న్యూజిలాండ్‌

2–1తో సిరీస్‌ సొంతం 

కార్తీక్, కృనాల్‌ పోరాటం వృథా

హామిల్టన్‌: స్వదేశంలో భారత్‌కు వన్డే సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌ చివరకు టి20 సిరీస్‌ను 2–1తో తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో మ్యాచ్‌లో కివీస్‌ 4 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కొలిన్‌ మున్రో (40 బంతుల్లో 72; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... సీఫెర్ట్‌ (25 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రాండ్‌హోమ్‌ (16 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. విజయ్‌ శంకర్‌ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా, రోహిత్‌ శర్మ (32 బంతుల్లో 38; 3 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (12 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (16 బంతుల్లో 33 నాటౌట్‌; 4 సిక్సర్లు), కృనాల్‌ పాండ్యా (13 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఏడో వికెట్‌కు 28 బంతుల్లోనే అభేద్యంగా 63 పరుగులు జోడించినా భారత్‌ ఓటమి పాలైంది. సీఫెర్ట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.  

ధాటిగా ఆరంభం... 
పరుగుల వరద పారిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మున్రో, సీఫెర్ట్‌ మెరుపు ఆరంభాన్ని అందించారు. పోటీ పడి బ్యాటింగ్‌ చేసిన వీరిద్దరు తొలి వికెట్‌కు  46 బంతుల్లోనే 80 పరుగులు జోడించడం విశేషం. ఖలీల్‌ ఓవర్లో సీఫెర్ట్‌ 2 ఫోర్లు, 1 సిక్సర్‌ బాదగా... కృనాల్‌ తొలి ఓవర్లో మున్రో ఫోర్, సిక్స్, ఆ తర్వాత సీఫెర్ట్‌ మరో సిక్సర్‌ కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో స్కోరు 66 పరుగులకు చేరింది. ఎట్టకేలకు కుల్దీప్‌ తన తొలి ఓవర్లోనే సీఫెర్ట్‌ను ఔట్‌ చేయడంతో కివీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మరోవైపు జోరు కొనసాగించిన మున్రో 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్‌ ఓవర్లో మళ్లీ 4, 6 బాదిన మున్రో కూడా చివరకు కుల్దీప్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. అయితే తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ కూడా తమ దూకుడు కొనసాగించడంతో కివీస్‌ భారీ స్కోరు చేయగలిగింది. ఏ భారత బౌలర్‌నూ వదలకుండా విలియమ్సన్‌ (21 బంతుల్లో 27; 3 ఫోర్లు), గ్రాండ్‌హోమ్, మిషెల్‌ (11 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు), రాస్‌ టేలర్‌ (7 బంతుల్లో 14 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) బౌండరీలు బాదడంతో న్యూజిలాండ్‌ 200 పరుగులు దాటి భారత్‌కు సవాల్‌ విసిరింది. మధ్యలో కుల్దీప్‌ కొంత వరకు ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు. లేదంటే కివీస్‌ స్కోరు మరింత ఎక్కువగా ఉండేది.  

సమష్టిగా చెలరేగినా... 
భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ తొలి ఓవర్లోనే శిఖర్‌ ధావన్‌ (5) వికెట్‌ కోల్పోయింది. అయితే రోహిత్, విజయ్‌ శంకర్‌ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యంగా రోహిత్‌ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడగా, శంకర్‌ దూకుడు కనబర్చాడు. సోధి ఓవర్లో వరుస సిక్సర్లతో ఆకట్టుకున్న శంకర్‌ తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. రోహిత్, శంకర్‌ రెండో వికెట్‌కు 46 బంతుల్లోనే 75 పరుగులు జోడించారు. పంత్‌ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లో 4, 6, 4 కొట్టడం విశేషం. మరో మూడు బంతుల తర్వాత మళ్లీ భారీ సిక్సర్‌ కొట్టిన పంత్‌ 6 బంతుల్లో 23 పరుగులకు దూసుకుపోయినా... అతని జోరు ఎక్కువ సేపు సాగలేదు. తొలి బంతికే సిక్సర్‌ బాదిన హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టాడు. అయితే నాలుగు పరుగుల వ్యవధిలో పాండ్యా, రోహిత్, ధోని (2) ఔటయ్యారు. చివరకు కార్తీక్, కృనాల్‌ కలిసి జట్టును గెలిపించేందుకు చివరి వరకు పోరాడినా అది సరిపోలేదు. 

సౌతీ అడ్డుకున్నాడు... 
చివరి వరకు పోరాడినా గెలుపు గీత దాటలేకపోయినందుకు నిరాశగా ఉంది. 210 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించడమంటే ఎప్పుడైనా కష్టమే. కానీ ఒత్తిడిని అధిగమిస్తూ ఆఖరి దాకా పోటీలో నిలిచాం. వన్డేల్లో జోరును ఇక్కడా కొనసాగించాలనుకున్నా అది సాధ్యం కాలేదు. అయితే ఈ పర్యటన ఆసాంతం కుర్రాళ్లు ఎంతో కష్టపడ్డారు. తుది ఫలితం వారికి నిరాశ కలిగించి ఉండవచ్చు. కానీ తప్పులనుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలి. సిరీస్‌ గెలిచి స్వదేశం తిరిగి వెళితే చాలా బాగుండేది. 
–రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top