
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అవకాశం
నేడు అపెక్స్ కౌన్సిల్ భేటీలో తుది నిర్ణయం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఒక మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి. 2026 జనవరిలో టీమిండియాతో 3 వన్డేలు, 5 టి20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ 8 మ్యాచ్‌ల కోసం జైపూర్, మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్, గువాహటి, హైదరాబాద్, త్రివేండ్రం, నాగ్‌పూర్ వేదికలను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ సిరీస్‌ల కోసం మరికొన్ని వేదికలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
తొలి టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుండగా... రెండో మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు ఆడనుంది. 22 నుంచి గువాహటిలో రెండో టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్య సఫారీ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లు వరుసగా రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నంలలో జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది.
ఇందులో భాగంగా కటక్, ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. రోస్టర్ విధానంలో అన్ని నగరాలకు ఆతిథ్యమిచ్చే అవకాశం ఇవ్వడంలో భాగంగా... వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే, టి20 సిరీస్‌ల కోసం హైదరాబాద్ వేదికను పరిశీలిస్తున్నారు. శనివారం జరగనున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం కివీస్‌తో షెడ్యూల్ ప్రకటించనున్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌ల అనంతరం ఫిబ్రవరి–మార్చిలో భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది.