ఆఖరి వన్డేలో భారత్‌ ఘన విజయం

India won sixth one day with South africa - Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. ఆరు వన్డేల సిరీస్‌లో ఐదు వన్డేలను అలవోకగా నెగ్గి, సొంత గడ్డపై ప్రోటీస్‌ను మట్టికరిపించింది. కొహ్లి సెంచరీతో రాణించడంతో ఆరో వన్డేలో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా బౌలర్లు విజృంభణకు సఫారీలు కుప్పకూలారు. ఆద్యంతం ఆకట్టుకున్న భారత బౌలర్లు.. దక్షిణాఫ్రికాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జాండో(54), ఫెహ్లకోహియో(34)లు మినహా మిగతా వారు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో దక్షిణాఫ్రికా 46.5 ఓవర్లలో 204 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లు సాధించి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా, చాహల్‌, బూమ్రాలు చెరో రెండు వికెట్లు తీశారు. పాండ్యా, కుల్దీప్‌లకు తలో వికెట్‌ దక్కింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 32.1 ఓవర్లలో 206 పరుగులు చేసింది. కోహ్లి 129( 123 బంతుల్లో) రాణించడంతో భారత్‌ సులువుగా విజయం సాధించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కోహ్లికి దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top