జెమీమా మెరుపు ఇన్నింగ్స్‌ 

 India Women beat srilanka in third one day match - Sakshi

శ్రీలంకతో మూడో టి20లో భారత మహిళల జట్టుదే విజయం

రాణించిన హైదరాబాద్‌ 

బౌలర్‌ అరుంధతి రెడ్డి

కొలంబో: ముందు బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరిసిన భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో రెండో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా రెండో టి20 మ్యాచ్‌ రద్దయింది. ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్‌ సోమవారం జరుగుతుంది.   టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసింది. శశికళ సిరివర్ధనే (32 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1సిక్స్‌), నీలాక్షి డిసిల్వా (20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతావారు విఫలమయ్యారు. హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి పొదుపుగా బౌలింగ్‌ చేసి 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకుంది. ఆమె ఓపెనర్‌ యశోద మెండిస్, శశికళ సిరివర్ధనేలను ఔట్‌ చేసింది.
 

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా రెండు వికెట్లు తీయగా... పూనమ్, అనూజా పాటిల్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది. 132 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్లు మిథాలీ రాజ్‌ (13), స్మృతి మంధాన (6) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా... యువతార జెమీమా రోడ్రిగ్స్‌ (40 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. వీరిద్దరు మూడు పరుగుల తేడాలో పెవిలియన్‌ చేరినా... వేద కృష్ణమూర్తి (11 నాటౌట్‌), అనూజా పాటిల్‌ (8 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top