విండీస్‌పై భారత్‌ విజయం

India Wins Second One Day Against West Indies - Sakshi

రెండో వన్డేలో 59 పరుగుల తేడాతో భారత్‌ విజయం

వన్డే కెరీర్‌లో 42వ సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్‌

రాణించిన అయ్యర్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. బ్యాట్‌తో సారథి కోహ్లీ (120; 125బంతుల్లో 14×4, 1×6), బంతితో భువనేశ్వర్‌ కుమార్‌(4/31) చెలరేగారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్‌ లక్ష్యాన్ని 270 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్‌ పోరాటం 42 ఓవర్లలో 210 పరుగుల వద్దే ముగిసింది. ఓపెనర్‌ లూయిస్‌ (65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌ (42; 52బంతుల్లో 4×4, 1×6) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. భారత బౌలరల్లో షమి(2/39), కుల్దీప్‌(2/59) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.

కోహ్లి 42వ శతకం
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. మొదట్లో, చివర్లో తడబడినా.. మధ్యలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీ, యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, సిక్స్‌) చక్కటి అర్ధ సెంచరీలతో మెరవడంతో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... ఓపెనర్లు విఫలమైనా కోహ్లి, అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంతో మంచి స్కోర్‌ చేసింది. వన్డేల్లో కోహ్లి 42వ శతకం సాధించాడు. 

ఓపెనర్‌ ధావన్‌ (2) పరుగుల ప్రయాస కొనసాగడంతో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే అతడు కాట్రెల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ ఔటివ్వకున్నా విండీస్‌ రివ్యూ కోరి ఫలితం రాబట్టింది. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 18; 2 ఫోర్లు)... 11వ బంతికి ఖాతా తెరిచాడు. ఆ తర్వాతా ఇబ్బందిగానే కనిపించాడు. సమన్వయ లోపంతో రెండుసార్లు రనౌటయ్యే ప్రమాదం ఎదుర్కొన్నాడు. ఎక్కువగా స్ట్రయికింగ్‌ తీసుకున్న కోహ్లి తనదైన శైలిలో సాధికారికంగా ఆడాడు. చకచకా అర్ధసెంచరీ (57 బంతుల్లో) అందుకున్నాడు. 
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top