ఫేవరెట్‌గా బరిలోకి భారత్‌

India will play against Russia in the first match on Thursday - Sakshi

నేటి నుంచి భువనేశ్వర్‌లో ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌ ఫైనల్స్‌ హాకీ టోర్నీ

ఫైనల్‌కు చేరితే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌కు అర్హత

భువనేశ్వర్‌: ఆసియా క్రీడల ద్వారా నేరుగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని చేజార్చుకున్న భారత్‌ రెండో అవకాశం కోసం సంసిద్ధమైంది. నేడు మొదలయ్యే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో టీమిండియా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పూల్‌ ‘ఎ’లో భారత్, పోలాండ్, రష్యా, ఉజ్బెకిస్తాన్‌... పూల్‌ ‘బి’లో జపాన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, అమెరికాలకు చోటు కల్పించారు.

గురువారం  తొలి మ్యాచ్‌లో రష్యాతో భారత్‌ ఆడుతుంది. అనంతరం 7న పోలాండ్‌తో, 10న ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరిన రెండు జట్లు అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న భారత్‌ సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కొత్త కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ పర్యవేక్షణలో మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని టీమిండియా తమ స్థాయికి తగ్గట్టు ఆడితే ఫైనల్‌ చేరుకోవడం కష్టమేమీ కాదు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top