
మరో క్లీన్‌స్వీప్ పై గురి
ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా... అంచనాలకు మించి రాణిస్తున్న భారత్...
సా.గం. 4.30 నుంచి
టెన్ క్రికెట్‌లో
ప్రత్యక్ష ప్రసారం
నేడు జింబాబ్వేతో భారత్ రెండో టి20
పరువు కోసం ఆతిథ్య జట్టు ఆరాటం
ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా... అంచనాలకు మించి రాణిస్తున్న భారత్... జింబాబ్వే పర్యటనను విజయంతో ముగించేందుకు సిద్ధమైంది. రెండో టి20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతోపాటు అజేయంగా భారత్‌కు తిరిగి రావాలని రహానే బృందం భావిస్తోంది. మరోవైపు అన్నింటిలో ఓడి ఒత్తిడికి లోనవుతున్న జింబాబ్వే ఒకే ఒక్క సంచలనంతో వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రయత్నిస్తోంది.
హరారే: ఓవైపు వరుస విజయాలతో ఊపు మీదున్న భారత్... మరోవైపు పరువు కోసం పాకులాడుతున్న జింబాబ్వే... రెండో టి20లో గెలిచి జైత్రయాత్రను పరిపూర్ణం చేయాలని టీమిండియా తహతహ... కనీసం చివరి మ్యాచ్‌నైనా విజయంతో ముగించాలని ఆతిథ్య జట్టు ప్రణాళికలు... ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్న చివరిదైన రెండో టి20లో ఇరుజట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఒకరిద్దరు మినహా...
ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత కుర్రాళ్లు పొట్టి ఫార్మాట్‌లోనూ తమ ఆధిపత్యాన్ని చూపెట్టారు. ఒకరిద్దరు మినహా ప్రతి ఒక్కరు ఏదో రూపంలో జట్టుకు సహాయపడ్డారు. అయితే తొలి టి20తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ పవర్‌ను జింబాబ్వేకు చూపాలని టీమిండియా భావిస్తోంది. ఓపెనర్లుగా రహానే, విజయ్‌లు మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడితే భారత్‌కు తిరుగుండదు. వన్‌డౌన్‌లో ఉతప్ప మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. కానీ రాయుడు స్థానంలో వచ్చిన మనీష్ పాండే, కేదార్ జాదవ్‌లు అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నారు. ఇది జట్టు భారీ స్కోరుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. తొలి మ్యాచ్‌లో 200 దాటుతుందనుకున్న స్కోరును ఈ ఇద్దరినీ అవుట్ చేయడం ద్వారా మెంపోయు కళ్లెం వేశాడు. మరి రెండో టి20లోనూ ఇదే పరిస్థితి పునరావృతమైతే జింబాబ్వే జట్టు సంచలనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లోయర్ ఆర్డర్‌లో బిన్నీ హిట్టింగ్‌పైనే భారత్ గెలుపు ఎక్కువగా ఆధారపడి ఉంది. అతను ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే బౌలర్లకు అంత శ్రమ తప్పుతుంది. బౌలింగ్‌లో స్పిన్ ద్వయం హర్భజన్, అక్షర్ పటేల్... జింబాబ్వేను వణికిస్తున్నారు. ఈ ఇద్దరికి పేసర్ల నుంచి కాస్త సాయమందితే భారత్ విజయం ఖాయం. సందీప్ శర్మ గాడిలో పడాల్సి ఉంది. సీనియర్లు భువనేశ్వర్, మోహిత్ శర్మలు పరుగులు నిలువరిస్తున్నా వికెట్లు తీయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు.
సంచలనం కోసం...
వరుస ఓటములతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన జింబాబ్వే సంచలనం కోసం ఎదురుచూస్తోంది. సొంత ప్రేక్షకుల ముందు ఈ ఒక్క మ్యాచ్‌లో శక్తికి మించి పోరాటం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పూర్తి ప్రణాళికాబద్ధంగా మ్యాచ్ ఆడాలని సీనియర్లకు మేనేజ్‌మెంట్ దిశానిర్దేశం చేసింది. అయితే ఈ ఫార్మాట్‌లో ఈ జట్టుకు పెద్దగా అనుభవం లేకపోవడం ప్రతికూలాంశం. మసకద్జా, చిగుంబురా, చిబాబాలు చివరి వరకు క్రీజులో ఉండేలా ప్రణాళికలు వేసుకుంటున్నా ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.
మిడిలార్డర్‌లో కోవెంట్రీ, రజా, ఇర్విన్‌లు కుదురుకుంటే భారీ స్కోరు ఖాయం. చివర్లో ఉత్సేయా మెరుపులు ఎలాగూ ఉంటాయి. వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న బౌలర్లు తొలి మ్యాచ్‌లోనూ ప్రభావం చూపెట్టారు. అయితే అందరూ సమష్టిగా రాణించడంలో విఫలమవుతున్నారు. పరుగులు కట్టడి చేయడంపైనే దృష్టిపెడుతున్న వీళ్లు వికెట్లు తీయలేకపోతున్నారు. మధ్యలో మెంపోయు అప్పుడప్పుడు మెరుస్తున్నా నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది.
జట్లు (అంచనా)
భారత్: రహానే (కెప్టెన్), విజయ్, రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, కేదార్ జాదవ్/శామ్సన్, స్టువర్ట్ బిన్నీ, హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, మోహిత్ శర్మ, సందీప్ శర్మ.
జింబాబ్వే: ఎల్టన్ చిగుంబురా (కెప్టెన్), మసకద్జా, చిబాబా, కోవెంట్రీ, సికిందర్ రజా, ఇర్విన్, క్రెమెర్, ఉత్సేయా, మజ్దీవా, జాన్ యుంబు, మెంపోయు.
పిచ్, వాతావరణం
రెండో వన్డేకు ఉపయోగించిన పిచ్‌ను ఈ మ్యాచ్‌కు వాడుతున్నారు. స్లో వికెట్. ఆరంభంలో పేసర్లకు కాస్త అనుకూలం. తర్వాత టర్న్ అయ్యే అవకాశం ఉంది. వర్షం ముప్పు లేదు.