టీ20: భారత్‌పై బంగ్లా విజయం

India Vs Bangladesh 1st T20: Bangladesh Won By Seven Wickets - Sakshi

తొలి టి20లో బంగ్లాదేశ్‌ అద్భుత విజయం

ఏడు వికెట్లతో టీమిండియాకు షాక్‌

ముష్ఫికర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌

రెండో మ్యాచ్‌ గురువారం

పేలవమైన బ్యాటింగ్, పదును లేని బౌలింగ్‌ వెరసి భారత్‌ తొలిసారి టి20ల్లో బంగ్లాదేశ్‌ చేతిలో భంగపడింది. రాజధానిలో తీవ్రమైన కాలుష్యం మధ్యే సాగిన మొదటి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. తొమ్మిదో ప్రయత్నంలో తొలిసారి భారత్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి సగర్వంగా నిలిచింది. షకీబ్, తమీమ్‌లాంటి స్టార్‌ ఆటగాళ్లు లేకుండానే ఆ జట్టు ప్రదర్శించిన స్ఫూర్తిదాయక ఆటతో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఏ దశలోనూ బ్యాటింగ్‌లో దూకుడు కనబర్చని రోహిత్‌ సేన ఆ తర్వాత ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలమైంది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ ఈ సారి అత్యుత్సాహం ప్రదర్శించకుండా చివరి వరకు నిలిచి తన జట్టును గెలిపించడం విశేషం. రోహిత్‌ ఇప్పటికే చెప్పినట్లు ఆ జట్టు విజయం ఇక ఏమాత్రం ‘సంచలనం’ కాదు!  

న్యూఢిల్లీ: భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్‌)దే అత్యధిక స్కోరు. అనంతరం బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. స్కోరు సమమైనపుడు కెప్టెన్‌ మహ్ముదుల్లా సిక్సర్‌తో బంగ్లాదేశ్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. ముష్ఫికర్‌ రహీమ్‌ (43 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), సౌమ్య సర్కార్‌ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) మూడో వికెట్‌కు 55 బంతుల్లో 60 పరుగులు జోడించి విజయంలో కీలక పాత్ర పోషించారు. సిరీస్‌లో బంగ్లా 1–0తో ఆధిక్యంలో నిలవగా... రెండో మ్యాచ్‌ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది.

రోహిత్‌ విఫలం... 
తొలి ఓవర్లోనే రోహిత్‌ శర్మ (9) వెనుదిరగడం భారత్‌ భారీ స్కోరు అవకాశాలను దెబ్బ తీసింది. షఫీయుల్‌ ఇస్లామ్‌ వేసిన ఈ ఓవర్‌ తొలి, నాలుగో బంతులకు ఫోర్లు కొట్టిన అతను చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ అవుట్‌ ప్రకటించాక రోహిత్‌ రివ్యూ కోరినా లాభం లేకపోయింది.

ధావన్‌ పరుగులు చేసినా... 
భారత ఇన్నింగ్స్‌లో ధావన్‌ టాప్‌ స్కోరర్‌ గా నిలిచినా... అతని బ్యాటింగ్‌ ఏమాత్రం టి20 స్థాయికి తగినట్లుగా సాగలేదు. తాను ఎదుర్కొన్న 13వ బంతికి గానీ అతను ఫోర్‌ కొట్టలేకపోయాడు. ఇన్నింగ్స్‌ ఏ దశలోనూ శిఖర్‌ ఇన్నింగ్స్‌ స్ట్రయిక్‌రేట్‌ ఒక్కసారి కూడా 100కు మించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పంత్‌తో సమన్వయ లోపంతో అతని ఆట ముగిసింది.

అందరూ అంతంతే... 
కోహ్లి గైర్హాజరులో మూడో స్థానంలో అవకాశం దక్కించుకున్న లోకేశ్‌ రాహుల్‌ (15) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (26 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేదు. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ శివమ్‌ దూబే (1)కు కలిసి రాలేదు. కృనాల్‌ పాండ్యా (8 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), సుందర్‌ (5 బంతుల్లో 14 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపుల కారణంగా చివరి 2 ఓవర్లలో భారత్‌ 30 పరుగులు రాబట్టింది. ఫలితంగా కొంత గౌరవప్రదమైన స్కోరు వద్ద ముగించగలిగింది.

కీలక భాగస్వామ్యం... 
సాధారణ లక్ష్య ఛేదనలో బంగ్లా తొలి ఓవర్లోనే లిటన్‌ దాస్‌ (7) వికెట్‌ కోల్పోయింది. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న నయీమ్‌ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సర్కార్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 45 పరుగులకు చేరింది. అయితే చహల్‌ తన తొలి ఓవర్లోనే నయీమ్‌ను అవుట్‌ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత సర్కార్, ముష్ఫికర్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముష్ఫికర్‌ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు చహల్‌ బౌలింగ్‌లో అంపైర్‌ ఎల్బీని తిరస్కరించగా భారత్‌ రివ్యూ చేయలేదు. రీప్లేలో అది అవుటయ్యేదని తేలింది! అదే ఓవర్‌ చివరి బంతికి అవకాశం లేని చోట సమీక్ష కోరి భారత్‌ రివ్యూ కోల్పోయింది. సర్కార్‌ను ఖలీల్‌ బౌల్డ్‌ చేయడంతో బంగ్లా మూడో వికెట్‌ కోల్పోయింది. అయితే ముష్ఫికర్, మహ్ముదుల్లా (15 నాటౌట్‌) కలిసి జట్టును గెలుపు తీరం చేర్చారు.

ధావన్‌ బ్యాట్‌ మారింది... 
సుదీర్ఘకాలంగా తన బ్యాట్‌పై ‘ఎంఆర్‌ఎఫ్‌’ స్టికర్‌ వాడిన ధావన్‌ కాంట్రాక్ట్‌ ముగిసినట్లుంది. అందుకే ఈ మ్యాచ్‌లో కొత్తగా ‘కూకాబుర్రా’ బ్యాట్‌తో ఆడాడు. ఆస్ట్రేలియా కంపెనీ కూకాబుర్రాకు చెందిన బ్యాట్‌ను ఒక భారత క్రికెటర్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లో వాడటం ఇదే తొలిసారి.

4,4,4,4
గెలుపు కోసం బంగ్లా చివరి 18 బంతుల్లో 35 పరుగులు చేయాలి. వికెట్లు చేతిలో ఉన్నా ఒత్తిడిలో అది అంత సులువు కాదు. అయితే 18వ ఓవర్లో ముష్ఫికర్‌ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను బౌండరీ వద్ద కృనాల్‌ నేలపాలు చేసి వారికి మరో అవకాశం ఇచ్చాడు. ఖలీల్‌ వేసిన 19వ ఓవర్లో ముష్ఫికర్‌ చెలరేగిపోయాడు. వరుసగా 4, 4, 4, 4 బాది గెలుపునకు చేరువగా తీసుకొచ్చాడు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) (బి) షఫీయుల్‌ 9; ధావన్‌ (రనౌట్‌) 41; రాహుల్‌ (సి) మహ్మదుల్లా (బి) అమీనుల్‌ 15; అయ్యర్‌ (సి) నయీమ్‌ (బి) అమీనుల్‌ 22; పంత్‌ (సి) నయీమ్‌ (బి) షఫీయుల్‌ 27; దూబే (సి అండ్‌ బి) అఫీఫ్‌ 1; కృనాల్‌ (నాటౌట్‌) 15; సుందర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 4;
మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1–10, 2–36, 3–70, 4–95, 5–102, 6–120.
బౌలింగ్‌: షఫీయుల్‌ 4–0–36–2, అమీన్‌ 4–0–27–0, ముస్తఫిజుర్‌ 2–0–15–0, అమీనుల్‌ 3–0– 22–2, సర్కార్‌ 2–0–16–0, అఫీఫ్‌ 3–0– 11–1, మొసద్దిక్‌ 1–0–8–0, మహ్మదుల్లా 1–0–10–0.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ (సి) రాహుల్‌ (బి) చహర్‌ 7; నయీమ్‌ (సి) ధావన్‌ (బి) చహల్‌ 26; సౌమ్య సర్కార్‌ (బి) ఖలీల్‌ 39; ముష్ఫికర్‌ (నాటౌట్‌) 60; మహ్ముదుల్లా (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 7;
మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 154.  
వికెట్ల పతనం: 1–8, 2–54, 3–114.  
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–24–1, వాషింగ్టన్‌ సుందర్‌ 4–0–25–0, ఖలీల్‌ అహ్మద్‌ 4–0–37–1, యజువేంద్ర చహల్‌ 4–0–24–1, కృనాల్‌ పాండ్యా 4–0–32–0, దూబే 0.3–0–9–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top