బీసీసీఐ కోరిక నెరవేరేనా?

బీసీసీఐ కోరిక నెరవేరేనా?

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై గుత్తాధిపత్యానికి తహతహలాడుతున్న బీసీసీఐ కోరిక నెరవేరుతుందా? ఐసీసీకి అత్యధికంగా ఆదాయాన్నిస్తున్న కారణంగా దాంట్లో సింహభాగం కూడా తమకే చెందాలనే వాదన నెగ్గుతుందా? ఈ ప్రశ్నలకు మంగళ, బుధవారాల్లో జరిగే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో సమాధానం దొరకనుంది. భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ ఇటీవల ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీకి చెందిన కార్యాచరణ బృందం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

 

 ఈ కమిటీలో ఈ మూడు దేశాలే ఉండడం గమనార్హం. అయితే వీటి ఆమోదం కోసం కనీసం ఏడు సభ్య దేశాల మద్దతు అవసరం. అలాగే నూతనంగా ఏర్పాటయ్యే ఐసీసీ చైర్మన్ పదవికి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఫేవరెట్‌గా ఉన్నారు. ఈ పదవి కారణంగా ఇప్పటిదాకా ఉన్న అధ్యక్షుడు నామమాత్రం అవుతారు. అయితే ఇప్పటికే ఈ ప్రతిపాదనలపై దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తికరం.

 

 కమిటీ ప్రతిపాదనలు

  ఐసీసీలో నూతన కార్యనిర్వాహణ కమిటీ ఏర్పాటు. మిగతా కమిటీలపై దీనిదే ఆధిపత్యం. కమిటీలో నలుగురు సభ్యులుంటారు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులకు చెందిన అధ్యక్షులు శాశ్వత సభ్యులుగా ఉంటారు. 

  ఐసీసీకి వచ్చే ఆదాయాన్ని సభ్య దేశాలకు పంపిణీ చేసే విధానంలో మార్పు. దీని ప్రకారం ఈ మూడు దేశాలకు అధిక భాగం ఆదాయం దక్కనుంది.

  భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) ఉండదు. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారానే సిరీస్‌లు జరుగుతాయి.

  ఐసీసీ చైర్మన్ పదవి ఏర్పాటు. ఈ పదవిని అధిష్టించేందుకు భారత్, ఇంగ్లండ్, ఆసీస్ బోర్డు మధ్య రొటేషన్ పద్ధతి ఉంటుంది.

  {పపంచ టెస్టు చాంపియన్‌షిప్ స్థానంలో 2017, 2021 సంవత్సరాల్లో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలి.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top