స్వదేశంలో జరగనున్న ప్రపంచ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తామని భారత జూనియర్ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు.
	న్యూఢిల్లీ: స్వదేశంలో జరగనున్న ప్రపంచ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తామని భారత జూనియర్ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. డిసెంబరు 6 నుంచి 15 వరకు ఇక్కడి ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులుగల భారత జట్టును బుధవారం ప్రకటించారు.
	
	ఈ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఆటగాళ్లందరికీ జెర్సీలను ప్రదానం చేసింది. 85 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న మన్‌ప్రీత్ మాట్లాడుతూ... ‘మేము మెరుగైన ప్రదర్శన ఇస్తాం. అయితే గొప్ప హామీలు మాత్రం ఇవ్వలేం. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతాం. మా తొలి లక్ష్యం హాలెండ్‌తో జరిగే ఆరంభ మ్యాచ్‌లో బాగా ఆడటమే’ అని అన్నాడు. పూల్ ‘సి’లో భారత్‌తోపాటు హాలెండ్, కొరియా, కెనడా ఉన్నాయి.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
