యువరాజ్ శ్రమ వృథా
విజయ్ హజారే వన్డే టోర్నీలో తొలి రోజు యువరాజ్ సింగ్ ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత దేశవాళీ మ్యాచ్ ఆడుతున్న ధోని బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు.
ధోని విఫలం విజయ్ హజారే వన్డే టోర్నీ రౌండప్
సాక్షి, హైదరాబాద్: విజయ్ హజారే వన్డే టోర్నీలో తొలి రోజు యువరాజ్ సింగ్ ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత దేశవాళీ మ్యాచ్ ఆడుతున్న ధోని బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. గ్రూప్ ‘ఎ’లో యువరాజ్ (93 బంతుల్లో 93; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సత్తా చాటినా... ముంబై చేతిలో పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. పంజాబ్ 254 పరుగులకు ఆలౌట్ కాగా, కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న జై బిస్తా (87 బంతుల్లో 92; 12 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై 5 వికెట్లకు 255 పరుగులు చేసి నెగ్గింది. అస్సాంతో జరిగిన మరో మ్యాచ్‌లో ముకుంద్ (104), అశ్విన్ (3/31) తమిళనాడును గెలిపించారు.
ఆలూరు: గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో జార్ఖండ్ 5 పరుగుల తేడాతో జమ్ము కశ్మీర్‌పై గెలుపొందింది. జార్ఖండ్ 210 పరుగులకు ఆలౌట్ కాగా, కశ్మీర్ 7 వికెట్లకు 205 పరుగులే చేయగలిగింది. ధోని (24 బంతుల్లో 9; 1 ఫోర్) విఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటకపై వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది.
ఢిల్లీ: త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో (గ్రూప్ సి) ఆంధ్ర 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఏజీ ప్రదీప్ (71), శివకుమార్ (51) అర్ధ సెంచరీల సహాయంతో ఆంధ్ర 273 పరుగులు చేసింది. అనంతరం త్రిపుర 215 పరుగులకే ఆలౌటైంది.