లంకపై భారత్‌ జయభేరి

India beat Sri Lanka, keep finals hope alive - Sakshi

7 వికెట్లతో ఘన విజయం 

మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నీ 

కౌలాలంపూర్‌: గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న భారత మహిళల జట్టు ఆసియా కప్‌ టి20 టోర్నీ నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక... భారత బౌలర్ల ధాటికి 7 వికెట్ల నష్టానికి 107 పరుగులకే పరిమితమైంది. హసిని పెరీరా (43 బంతుల్లో 46 నాటౌట్‌; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. ఏక్తా బిష్త్‌ (2/20), జులన్‌ గోస్వామి (1/20), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అనూజ పాటిల్‌ (1/19), పూనమ్‌ యాదవ్‌ (1/23) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆ జట్టులో ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం టాపార్డర్‌ సమష్టిగా రాణించడంతో భారత్‌ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. మిథాలీ రాజ్‌ (23), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (24), వేద కృష్ణమూర్తి (29 నాటౌట్‌; 4 ఫోర్లు) అనూజ పాటిల్‌ (19 నాటౌట్‌) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ టోర్నీలో థాయ్‌లాండ్, మలేసియాలపై వరుస విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం గత మ్యాచ్‌లో బంగ్లా చేతిలో ఓడింది. 

మిథాలీ@ 2000... 
ఈ మ్యాచ్‌ ద్వారా భారత వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టి20ల్లో భారత్‌ తరఫున 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. 35 ఏళ్ల మిథాలీ 74 మ్యాచ్‌లు ఆడి 2015 పరుగులు చేసింది. మొత్తంగా ఈ మైలురాయిని దాటిన ఏడో మహిళా క్రికెటర్‌ మిథాలీ. ఇంగ్లండ్‌ స్టార్‌ ఎడ్వర్ట్స్‌ (2,605) అగ్రస్థానంలో ఉంది. టి20 గణాంకాల్లో పురుషుల జట్టు కెప్టెన్‌ కోహ్లి (1,983) కూడా మిథాలీ కంటే వెనుకే ఉండటం గమనార్హం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top