అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్‌

Ind Vs Ban: 2 Years Ago Sri Lanka Players Vomitted - Sakshi

ఢిల్లీ:  టీమిండియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఆదివారం జరుగనున్న తొలి టీ20పై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. భారత-బంగ్లాదేశ్‌ల మధ్య ఇక్కడి తొలి టీ20 మ్యాచ్‌తోనే ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్‌కు ఆరంభం కానుంది. ఈ తరుణంలో తొలి మ్యాచ్‌లోనే ఇరు జట్ల క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడి ఏమైనా సమస్యలకు లోనైతే ఏమి చేయాలని డీడీసీఏ కలవరపడుతోంది. ఒకవైపు ఢిల్లీలోని ప్రజలను అవరసమైతే తప్పితే బయటకు వెళ్లవద్దని డాక్టర్లు సూచించిన సందర్భంలో క్రికెటర్లు మాత్రం ఎలా ఆడతారనే సందేహాలు నెలకొన్నాయి. వేదికను మార్చాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో అలా చేయడం అంత సులువు కాదు కాబట్టి బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సౌరవ్‌ గంగూలీ కూడా ఏమి చేయలేకపోతున్నాడు. అసలు వేచి చూడటం ఒక్కటే మార్గంగా గంగూలీ భావిస్తున్నాడు. ఇప్పటికే క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేసే క్రమంలో ముఖానికి పొల్యూషన్‌ మాస్క్‌లు ధరిస్తున్నారు.

ఇలా ఢిల్లీలో క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడటం ఇదేమి తొలిసారి కాదు. గతంలో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెటర్లు సైతం ఇదే తరహాలు ఇబ్బందులు పడ్డారు. 2017లో దీని ప్రభావాన్ని తట్టుకోలేని కొంతమంది లంక క్రికెటర్లు వాంతులు చేసుకోగా, మరికొంత మంది అస్వస్థతకు లోనయ్యారు. అది టెస్టు మ్యాచ్‌ కావడంతో లంక క్రికెటర్లు ఐదు రోజుల పాటు బాధను భరించారు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ చూస్తే ఢిల్లీలో ఏమీ మార్పులు రాలేదు. ప్రధానంగా మ్యాచ్‌లకు ఢిల్లీకి వేదికను సిద్ధం చేసే క్రమంలో కూడా వాయు కాలుష్య ప్రభావం ఆలోచనే రాలేదు మన క్రికెట్‌ పెద్దలకు. అప్పట్నుంచీ చూస్తే దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఇప్పుడు ఒక్కసారిగా వాయు కాలుష్యం అధికంగా ఉండటంతో ఏమి చేయాలంటూ మదన పడుతున్నారు. ఇది కచ్చితంగా బీసీసీఐకి సవాల్‌తో కూడుకున్న అంశమే. మరో రెండు రోజుల వ్యవధిలో ఇక్కడ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఒకవేళ అనుకూలంగా ఉంటే మాత్రం మ్యాచ్‌ జరుగుతుంది.. అదే సమయంలో ప్రేక్షకులు కూడా స్టేడియానికి వస్తారు. కాని పక్షంలో మ్యాచ్‌ జరిగినా.. ఆదరణ మాత్రం ఉండదు. ఏ ఒక్కరు కావాలని ముప్పును కొని తెచ్చుకోవడానికి ఇష్టపడరు కాబట్టి, టికెట్లు సైతం పెద్దగా అమ్ముడయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సాధారణంగా శీతాకాలంలో ఢిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించవద్దనే డిమాండ్‌ వినిపిస్తున్నా రొటేషన్‌ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను ఈ వేదికను కేటాయించక తప్పడం లేదు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే మ్యాచ్‌ను రద్దు చేసి మరొక వేదికలో మరొక తేదీలో నిర్వహించడమే మేలు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్‌ను ప్రతికూల పరిస్థితుల్లోనే జరిపే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top