287 కొడతారా? లేక సిరీస్‌ సమర్పిస్తారా? | IND VS AUS 3rd ODI: Team India Target 287 Runs | Sakshi
Sakshi News home page

టీమిండియా లక్ష్యం 287

Jan 19 2020 5:23 PM | Updated on Jan 19 2020 5:35 PM

IND VS AUS 3rd ODI: Team India Target 287 Runs - Sakshi

చేతికి కట్టు కట్టుకొని ఉండటం చూస్తుంటే.. ధావన్‌ బ్యాటింగ్‌కు దిగడం కష్టమేనని తెలుస్తోంది

బెంగళూరు: మూడు వన్డేల సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో టీమిండియాకు ఆస్ట్రేలియా 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ (131; 132 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీతో అదరగొట్టాడు. స్మిత్‌కు తోడు లబుషేన్‌(54) అర్థసెంచరీతో మెరవగా.. అలెక్స్‌ క్యారీ(30) పర్వాలేదనిపించాడు. ఓ క్రమంలో పర్యాటక ఆసీస్‌ జట్టు 300కి పైగా పరుగులు సాధిస్తుందనుకున్నారు. కానీ చివర్లో భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్‌ను కట్టడి చేశారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ నాలుగు వికెట్లతో రాణించగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్ల పడగొట్టాడు. అయితే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయపడ్డాడు. అంతేకాకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లో అతడు చేతికి కట్టు కట్టుకొని ఉండటం చూస్తుంటే.. ధావన్‌ బ్యాటింగ్‌కు దిగడం కష్టమేనని తెలుస్తోంది. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. డేవిడ్‌ వార్నర్‌(3)ను షమీ ఔట్‌ చేయగా.. ఆరోన్‌ ఫించ్‌ (19)ను రనౌట్‌ అయ్యాడు. దీంతో 46 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆసీస్‌ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో లబుషేన్‌తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆరంభంలో వీరిద్దరూ ఆచితూచి ఆడారు. అనంతరం వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్దసెంచరీలు పూర్తిచేశారు. అయితే అర్ధసెంచరీ అనంతరం జడేజా బౌలింగ్‌లో కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌కు లబుషేన్‌ వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లబుషేన్‌ నిష్క్రమణ తర్వాత అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన మిచెల్‌ స్టార్క్‌‌(0) భారీ షాట్‌కు యత్నించి జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. 

అదరగొట్టిన భారత బౌలర్లు..
వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో స్టీవ్‌ స్మిత్‌ గేర్‌ మార్చాడు. అలెక్స్‌ క్యారీతో కలిసి దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా అలెక్స్‌ వచ్చీ రాగానే బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. దీంతో ఓ క్రమంలో ఆసీస్‌ మూడు వందలకు పైగా పరుగులు సాధిస్తుందనుకున్నారు. కానీ చివర్లో భారత బౌలర్లు రాణించారు. ముఖ్యంగా మహ్మద్‌ షమీ వరుసగా వికెట్లు పడగొడుతూ పర్యాటక జట్టుపై ఒత్తిడి పెంచాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా స్మిత్‌ మాత్రం క్రీజులో పాతుకపోయాడు. ఈ క్రమంలోనే కెరీర్‌లో 9వ శతకం సాధించాడు. సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన స్మిత్‌ను షమీ పెవిలియన్‌కు పంపించాడు. స్మిత్‌ను వెనక్కిపంపింన షమీ ఆ వెంటనే కమిన్స్‌(0), జంపా(0)లను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు సాధించింది.  

చదవండి: 
ధావన్‌కు గాయం.. బ్యాటింగ్‌కు రాడా?
కోహ్లి క్యాచ్‌.. లబుషేన్‌ షాక్!
ఎంత పనిచేశావ్‌ స్మిత్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement