ఫైనల్లో హాట్‌షాట్స్

ఫైనల్లో హాట్‌షాట్స్ - Sakshi


 సీజన్ ఆరంభం నుంచి సైనా చెలరేగుతున్నా.. సహచరులు అడపాదడపా తడబడ్డారు. కానీ తీవ్ర ఒత్తిడిలో ఆడే సెమీఫైనల్లో మాత్రం సైనాతో పాటు మిగిలిన వాళ్లూ చెలరేగారు. దీంతో హైదరాబాద్ హాట్‌షాట్స్ 3-0తో పుణే పిస్టన్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది.

 

 నేటి సెమీఫైనల్ బెంగళూరులో

 ముంబై మాస్టర్స్  x  అవధ్ వారియర్స్

 రా. గం. 8.00 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

 సాక్షి, హైదరాబాద్: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) తొలి సీజన్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్ ఫైనల్‌కు చేరింది. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో హాట్‌షాట్స్ 3-0తో పుణేను ఓడించింది. దీంతో చివరి రెండు మ్యాచ్‌లు నిర్వహించాల్సిన అవసరం కూడా రాలేదు. పురుషుల, మహిళల సింగిల్స్‌తో పాటు పురుషుల డబుల్స్‌లో కూడా హాట్‌షాట్స్‌కే గెలుపు దక్కింది.  అజయ్ జయరామ్‌కు ప్లేయర్ ఆఫ్ ది టై అవార్డు లభించింది.

 

 మరోసారి జయరామ్ సంచలనం...

 లీగ్ దశలో ప్రపంచ ఐదో ర్యాంకర్ యుగెన్ టిన్ మిన్‌ను ఓడించిన అజయ్ జయరామ్ ఈ సారి కూడా అదే సంచలనాన్ని పునరావృతం చేశాడు. ఆరంభంలో వెనుకబడినా పోరాటపటిమ కనబర్చి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం అజయ్‌కు తిరుగు లేకుండా పోయింది. 21-17, 21-11తో మ్యాచ్ నెగ్గి హాట్‌షాట్స్‌కు ఈ యువ ఆటగాడు శుభారంభం అందించాడు.

 

 షెంక్ చేతులారా...

 మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-10, 19-21, 11-8 తేడాతో జులియన్ షెంక్‌పై విజయం సాధించింది. గత మ్యాచ్‌లో షెంక్‌ను ఓడించిన సైనా ఈ సారి కూడా పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్‌లో బోణీ చేసిన ఆమె ఏ దశలోనూ వెనుకబడలేదు. అయితే సైనా ప్రదర్శనకంటే షెంక్ చేసిన తప్పులే ఎక్కువగా ఉన్నాయి. సగం పాయింట్లు షెంక్ అనవసర తప్పిదాల ద్వారానే కోల్పోయింది.  సైనా 6-3తో ఉన్న దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10-3కు చేరింది. ఆ తర్వాత 16-4 వరకు ఆమె ఆధిక్యం కొనసాగింది. షెంక్ కోలుకునే ప్రయత్నం చేసినా చివరకు 21-10తో గేమ్ సైనా సొంతమైంది.

 

 ఏడు పాయింట్లతో...

 రెండో గేమ్‌లో మాత్రం షెంక్ తన స్థాయికి తగ్గ ఆట కనబర్చింది. ప్రతీ పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీ పోరాడారు. అయితే చక్కటి స్మాష్‌లతో దూకుడు కనబర్చిన సైనా వేగంగా ఆధిక్యంలోకి దూసుకు వెళ్లి 18-11తో గెలుపుకు చేరువగా వచ్చింది. అయితే ఈ దశలో షెంక్ ఒక్కసారిగా విజృంభించింది. వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 18-18తో స్కోరు సమం చేసింది.

 

 సైనా మరో పాయింట్ సాధించినా... షెంక్ వరుసగా మూడు పాయింట్లతో గేమ్ గెల్చుకుంది. మూడో గేమ్‌లో మాత్రం షెంక్ ఒత్తిడికి లోనైంది. ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా నింపాదిగా ఆడిన సైనా గేమ్ గెలిచి మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో హాట్‌షాట్స్ జోడి గో వి షెమ్-వా లిమ్ కిమ్, పిస్టన్స్ జంట నీల్సన్ ఫిషర్-సనవే థామస్‌పై సంచలన విజయం సాధించింది. తొలి గేమ్ ఓడినా కోలుకున్న హైదరాబాద్ జోడి 16-21, 21-14, 11-7 తేడాతో గెలుపొంది తమ జట్టుకు ఫైనల్లో చోటు ఖాయం చేసింది.

 

 ఆ ర్యాలీ అద్భుతం...

 సైనా, షెంక్‌ల మధ్య జరిగిన రెండో గేమ్‌లో స్కోరు 5-5తో ఉన్నప్పుడు ఒకటే పాయింట్ కోసం సుదీర్ఘ ర్యాలీ ఆడారు. సుమారు 30సార్లు షటిల్ అటూ ఇటూ తిరిగింది. ఉత్సుకతతో స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడిపోయారు. చివరకు షెంక్ షాట్‌ను అవుట్‌గా భావించి సైనా వదిలేసింది. అయితే అది సరైందే అని తేలడంతో షెంక్ 6-5 ఆధిక్యంలోకి వెళ్లింది. లైన్‌కాల్‌పై సైనా కాస్త అసంతృప్తి కూడా ప్రదర్శించింది. అది తర్వాతి పాయింట్‌పై కనిపించింది. అద్భుతమైన స్మాష్‌తో స్కోరు చేసిన సైనా తన ఉద్వేగాన్ని ఆపుకోలేక అరిచేసింది. ప్రేక్షకులు మాత్రం ఆ ర్యాలీని పూర్తిగా ఆనందించి చప్పట్లతో ఇద్దరినీ అభినందించారు.

 

 మరొకటి గెలవాలి: ప్రసాద్ వి.పొట్లూరి, సైనా

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top