
డబ్లిన్: ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకున‍్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 143 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను దిగ్విజయంగా ముగించింది. ఇప్పుడు అదే ఊపుతో ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతోంది విరాట్ అండ్ గ్యాంగ్. అయితే తుది జట్టు కూర్పు అనేది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి తలనొప్పిగా మారిందట.
ఐర్లాండ్‌తో మ్యాచ్ తర్వాత కోహ్లి మాట్లాడుతూ..‘రెండు గేముల్లో భారత్ జట్టు అన‍్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది. అంతా బ్యాట్‌తో, బాల్‌తో రాణించారు. ఇది జట్టు సమతుల్యతకు నిదర్శనం. ఇక్కడే నాకు ఒక సమస్య వచ్చి పడింది. తదుపరి గేములకు ఎవర్ని ఎంపిక చేయాలో అర్థం కావడం లేదు. ఇదొక మంచి సమస్యగానే పరిగణిస్తున్నా. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సమష్టి ప్రదర్శనతో దూసుకుపోవడం గర్వించదగ్గ విషయం. ప్రధానం యువ క్రికెటర్లు వారికి అందివచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకోవడం నాకు చాలా సంతోషం కల్గిస్తుంది. మన రిజర్వ్ బెంచ్ కూడా చాలా బలంగా ఉండటంతో జట్టు ఎంపికపై తర్జన భర్జనలు తప్పడం లేదు’ అని కోహ్లి తెలిపాడు.
మరొకవైపు ఇంగ్లండ్ పర్యటనపై కోహ్లి మాట్లాడుతూ.. ప్రత్యర్థి ఎవరు అనేది తమకు అనవసరమని, ప్రతీ జట్టును ఒకే తరహాలోనే చూస్తేనే విజయాలు లభిస్తాయన్నాడు. ఇంగ్లండ్‌లో పిచ్‌లతో తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.