
న్యూఢిల్లీ: స్వింగ్‌ను రాబట్టేందుకు బంతి మెరుపు పెంచే ప్రయత్నంలో బౌలర్లకు సరైన ప్రత్యామ్నాయం చూపించాలని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయ పడ్డారు. షైనింగ్ కోసం ఉమ్ముకు బదులు మరేదైనా పదార్థాన్ని సూచించాలని ఆయన కోరారు. అన్ని జట్లు దాన్నే అనుసరించినపుడు ఎవరికీ ఏ ఇబ్బందులు ఉండవన్నారు. క్రికెట్లో సాధారణంగా బౌలర్లు ఉమ్ముతోనే బంతిని షైనింగ్ చేస్తారు. కరోనా మహమ్మారి వల్ల దీనిని ఐసీసీ నిషేధించింది. ఈ నేపథ్యంలో బయటి పదార్థం వాడే వెసులుబాటు ఇవ్వాలని పలువురు బౌలర్లు, కోచ్‌లు సూచిస్తున్నారు. దీనిపై భరత్ అరుణ్ మాట్లాడుతూ ‘మైనం లేదా వ్యాజిలీన్ లేదా మరేదైనా గానీ... ఏదో ఒకటి వాడే వెసులుబాటు ఇస్తే, అన్ని జట్ల బౌలర్లు దాన్నే వాడతారు. అటువంటి పదార్థాన్ని ప్రయత్నిస్తే తప్పేంటి’ అని అన్నారు. ఉమ్మును వాడే పద్ధతి నుంచి అంత తేలిగ్గా బయటపడమని, శిక్షణ శిబిరాల్లో తరచూ దానిపై అవగాహన కల్పిస్తే ఆ అలవాటు తగ్గుతుందని అరుణ్ చెప్పారు.