ఆసీస్‌ పేసర్‌కు షఫాలీ భయం!

I Just Hate Playing India, Australia pacer Megan Schutt - Sakshi

భారత్‌తో ఆడటాన్ని ద్వేషిస్తున్నా..

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక్కడ ఆసీస్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ అయితే, భారత్‌ తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరింది. దాంతో పోరు ఆసక్తికరమే. కాకపోతే మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఆరంభపు మ్యాచ్‌ భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య జరిగితే, ముగింపు మ్యాచ్‌ కూడా వీరి మధ్య జరగడం ఇక్కడ విశేషం. కాగా, భారత్‌తో ఫైనల్లో తలపడటాన్ని ఒకింత ద్వేషిస్తున్నట్లు ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మెగాన్‌ స్కట్‌ పేర్కొన్నారు. ఇందుకు భారత మహిళా ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతీ మంధానాలే కారణమట. వీరిద్దరికి బౌలింగ్‌ వేయాలంటే తనకు ఒక రకమైన భయం ఏర్పడిందని మెగాన్‌ స్కట్‌ స్పష్టం చేశారు. (ఆసీస్‌ ఆరోసారి...)

‘ భారత మహిళల జట్టుతో ఫైనల్స్‌ ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా. ఎందుకంటే షఫాలీ, స్మృతీల బ్యాటింగ్‌ నాకు వణుకు పుట్టిస్తోంది. ప్రధానంగా షఫాలీ ఎఫెన్స్‌కు నా వద్ద సమాధానం ఉండకపోవచ్చు. స్మృతీ, షఫాలీలు భారత​ జట్టుకు వెన్నుముక. వారు బలమైన షాట్లతో దాడి చేస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన ముక్కోణపు సిరీస్‌లో షఫాలీ కొట్టిన సిక్స్‌.. నా కెరీర్‌లో నేను చూసిన అత్యుత్తమ సిక్స్‌. ప్రత్యేకంగా వారికి నేను బౌలింగ్‌ చేయడం అంత మంచి కాదేమో. ఆ జోడికి నా బౌలింగ్‌ కూడా సరైన మ్యాచింగ్‌ కూడా కాకపోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే పవర్‌ ప్లేలో వారికి నేను జోడిని కాను. వారి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా’ అని మెగాన్‌ స్కట్‌ పేర్కొన్నారు.

నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో స్కట్‌ రెండు వికెట్లు సాధించడంతో పాటు 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే టీమిండియాతో జరుగనున్న ఫైనల్లో మంధాన, షఫాలీలకు కచ్చితమైన బౌలింగ్‌ వేయకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆందోళనలో ఉన్నారు మెగాన్‌. ఇందుకు కారణం ఈ టోర్నీ ఆరంభపు మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది.  అయితే ఆసీస్‌ మ్యాచ్‌లో స్కట్‌ వేసిన తన వ్యక్తిగత తొలి ఓవర్‌లో షఫాలీ ధాటికి బెంబేలెత్తిపోయింది. ఆ ఓవర్‌లో షఫాలీ నాలుగు ఫోర్లు కొట్టి మెగాన్‌కు చుక‍్కలు చూపించింది. ఇదే భయం ఇప్పుడు ఆమెను మరింత కలవర పెడుతున్నట్లు కనబడుతోంది. (తొలిసారి ఫైనల్లో భారత మహిళలు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top