భారత్‌ జోరు కొనసాగేనా! | Hockey World League Final from today | Sakshi
Sakshi News home page

భారత్‌ జోరు కొనసాగేనా!

Dec 1 2017 12:56 AM | Updated on Dec 1 2017 12:56 AM

Hockey World League Final from today - Sakshi

భువనేశ్వర్‌:  ఆసియా కప్‌లో ఇటీవలే విజేతగా నిలిచి సత్తా చాటిన భారత హాకీ జట్టు ముందు మరో పెద్ద సవాల్‌ నిలిచింది. అగ్రశ్రేణి జట్లు బరిలో నిలిచిన హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్‌లో భారత్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటినుంచి జరిగే ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ టాప్‌–8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఈ టోర్నీ డిఫెండింగ్,  ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఉపఖండంలో జరిగే ఏ టోర్నీలోనైనా భారత్‌ మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. కానీ ఈ లీగ్‌లో పరిస్థితులు భిన్నం. ప్రపంచ మేటి జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో భారత్‌ గెలవాలంటే అద్భుతంగా పోరాడాల్సి ఉంటుంది. ఆసియా కప్‌ దక్కించుకొని మన జట్టు మంచి ఊపు మీద ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో మన జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చాంపియన్స్‌ ట్రోఫీ, అజ్లాన్‌ షా కప్, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఆ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఆ పరాజయాలకు బదులు తీర్చుకునే అవకాశం ప్రస్తుతం భారత్‌ ముందుంది.  

కోచ్‌కు పరీక్ష...
రెండు నెలల క్రితమే భారత జట్టు కోచ్‌ పగ్గాలు చేపట్టిన జోయెర్డ్‌ మరీనేకు ఇది అసలు సిసలు పరీక్ష. వచ్చే ఏడాది పెద్ద పెద్ద టోర్నీలు జరగనున్న నేపథ్యంలో జట్టు బలాబలాలను పరీక్షించుకునేందుకు కోచ్‌కు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. మరీనే కోచ్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పెను మార్పుల జోలికి వెళ్లకుండా.. డిఫెన్స్‌తో పాటు, వ్యూహాత్మక శిక్షణ పైనే దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది ఆసియా గేమ్స్, కామన్వెల్త్‌ గేమ్స్, వరల్డ్‌కప్‌ జరగనుండటంతో.. ఈ టోర్నీలో మన ఆటగాళ్ల లోపాలతో పాటు సత్తా పై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మరీనే కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మన జట్టు ఆసియా కప్‌ ఫైనల్‌లో 2–1తో మలేసియాపై విజయం సాధించింది. సర్దార్‌ సింగ్‌ లేకపోవడంతో మిడ్‌ఫీల్డర్‌గా కెప్టెన్‌ మన్‌ప్రీత్‌పై బాధ్యత మరింత పెరిగింది. కెప్టెన్‌తో పాటు గతేడాది జరిగిన జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో ఆకట్టుకున్న  హర్మన్‌ప్రీత్‌ సింగ్, సుమిత్, దిప్సన్‌ టిర్కీ, గుర్జంత్‌ సింగ్, వరుణ్‌కుమార్‌ లాంటి యువ ఆటగాళ్లపైనే అందరి దృష్టి ఉండనుంది. జట్టులో సీనియర్లు రూపిందర్‌ పాల్‌ సింగ్, బీరేంద్ర లక్డా గాయాల నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చారు. వారు తమని తాము నిరూపించుకోవడానికి ఇది చక్కటి అవకాశం. హాకీ ఇండియా లీగ్‌–2017లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అమిత్‌ రోహిదాస్‌ జట్టులో ఉండటం అదనపు బలాన్ని చేకూర్చనుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నీ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. దూకుడుగా ఆడుతూ.. ట్రోఫీని నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆసీస్‌ బరిలోకి దిగుతోంది. గతేడాది జరిగిన రియో ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాతినుంచి ఆ జట్టు నిలకడగా రాణిస్తోంది.

పూల్‌ ‘బి’:    
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ
పూల్‌ ‘ఎ’:    
అర్జెంటీనా, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్‌
మ్యాచ్‌ సా.7.30 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement