భారత్‌ 15 కజకిస్తాన్‌ 0 | India dismiss Kazakhstan 15-0 at Mens Hockey Asia Cup | Sakshi
Sakshi News home page

భారత్‌ 15 కజకిస్తాన్‌ 0

Sep 2 2025 5:25 AM | Updated on Sep 2 2025 5:25 AM

India dismiss Kazakhstan 15-0 at Mens Hockey Asia Cup

‘సూపర్‌–4’ దశకు టీమిండియా

లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన ఆతిథ్య జట్టు  

రాజ్‌గిర్‌ (బిహార్‌): తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్‌ తేడాతో నెగ్గిన భారత హాకీ జట్టు... చివరి లీగ్‌ మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయింది. ఆసియా కప్‌ పురుషుల హాకీ టోరీ్నలో భాగంగా... కజకిస్తాన్‌ జట్టుతో సోమవారం జరిగిన పూల్‌ ‘ఎ’ ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు 15–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఎనిమిది మంది ఆటగాళ్లు గోల్స్‌ చేశారు. టీమిండియా సగటున నాలుగు నిమిషాలకు ఒక్కో గోల్‌ సాధించడం విశేషం. లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టీమిండియా అజేయంగా నిలిచింది. తొమ్మిది పాయింట్లతో పూల్‌ ‘ఎ’లో అగ్రస్థానం పొందిన భారత బృందం ‘సూపర్‌–4’ సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించింది. 
 
అంతర్జాతీయస్థాయిలో తొలిసారి కజకిస్తాన్‌తో పోటీపడ్డ భారత్‌ ప్రత్యర్థి జట్టుపై ఎడతెరిపిలేని దాడులు నిర్వహించి హడలెత్తించింది. ఐదో నిమిషంలో భారత్‌ నుంచి తొలి గోల్‌ నమోదుకాగా... మ్యాచ్‌ ముగియడానికి మరో నిమిషం వరకు ఈ గోల్స్‌ వేట కొనసాగింది. భారత్‌ తరఫున అభిõÙక్‌ (5వ, 8వ, 20వ, 59వ నిమిషాల్లో) అత్యధికంగా నాలుగు గోల్స్‌ చేశాడు. 

సుఖ్‌జీత్‌ సింగ్‌ (15వ, 32వ, 38వ నిమిషాల్లో), జుగ్‌రాజ్‌ సింగ్‌ (24వ, 31వ, 47వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చొప్పున సాధించారు. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (26వ నిమిషంలో), అమిత్‌ రోహిదాస్‌ (29వ నిమిషంలో), రాజిందర్‌ సింగ్‌ (32వ నిమిషంలో), సంజయ్‌ (54వ నిమిషంలో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (55వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. భారత జట్టుకు 13 పెనాల్టీ కార్నర్‌లు, 2 పెనాల్టీ స్ట్రోక్‌లు లభించాయి. 13 పెనాల్టీ కార్నర్‌లలో కేవలం నాలుగింటిని మాత్రమే భారత ఆటగాళ్లు గోల్స్‌గా మలిచారు. లేదంటే భారత్‌ ఖాతాలో మరిన్ని గోల్స్‌ చేరేవి. కజకిస్తాన్‌ జట్టు తమకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకుంది.  

చైనా ముందుకు... 
పూల్‌ ‘ఎ’లో భాగంగా చైనా, జపాన్‌ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. చైనా, జపాన్‌ జట్లు నాలుగు పాయింట్లతో సమంగా నిలిచినా... గోల్స్‌ అంతరంలో జపాన్‌ను (6 గోల్స్‌) వెనక్కి నెట్టిన చైనా (11 గోల్స్‌) జట్టుకు ‘సూపర్‌–4’ బెర్త్‌ దక్కింది. పూల్‌ ‘బి’ నుంచి డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్షిణ కొరియా, మలేసియా జట్లు కూడా ‘సూపర్‌–4’ దశకు అర్హత పొందాయి. నేడు విశ్రాంతి దినం. బుధవారం నుంచి భారత్, కొరియా, చైనా, మలేసియా జట్ల మధ్య ‘సూపర్‌–4’ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో దక్షిణ కొరియాతో భారత్‌ (రాత్రి గం. 7:30 నుంచి), మలేసియాతో చైనా (సాయంత్రం గం. 5 నుంచి) తలపడతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement